Health: సంతానలేమికి ఐవీఎఫ్‌.. సరైన ఫలితాలు రావాలంటే?

ఐవీఎఫ్‌ చికిత్స సమయంలో బదిలీ అయిన పిండాల నాణ్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తగిన సంఖ్యలో కణాలు,అధిక నాణ్యత కలిగిన పిండాలు ఇంప్లాంటేషన్‌ తదుపరి గర్భధారణకు మంచి అవకాశాలను కలిగి ఉంటాయి. అలాగే పిండాల సంఖ్య కూడా విజయ శాతాన్ని ప్రభావితం చేస్తుంది.

IVF: ఆధునిక సమాజంలో సంతానలేమి సమస్య అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరిన ఈ సమస్యకు ఓ వైపు స్వల్పంగా పరిష్కారాలు మాత్రమే ఉంటే.. దీనికి కారణాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇన్‌–విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవిఎఫ్‌) చికిత్సలకు డిమాండ్‌ పెరిగింది. అయితే ఈ చికిత్స వల్ల చాలా మందికి సంతాన లేమి సమస్యకు పరిష్కారం లభించినప్పటికీ.. నూటికి కేవలం 50 నుంచి అత్యధికంగా 60శాతం మాత్రమే ఈ చికిత్స విజయవంతం అవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అది కూడా వయసుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

పెళ్లి చేసుకున్న జంటలు తమ మొదటి గర్భధారణను ఆలస్యం చేయడంతో మొదలుపెట్టి పర్యావరణ కారకాలు, అధిక ఒత్తిడి స్థాయిలు, ఆధునిక జీవనశైలి తదితర సమస్యల వల్ల సంతానలేమికి గురవుతున్నారు. వీరు ఐవీఎఫ్‌ చికిత్సను ఎంచుకున్నప్పటికీ.. పూర్తి ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? ఈ విషయంపై ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.జ్యోతి బుడి ఇలా వివరిస్తున్నారు.

సరైన గర్భనిరోధక పద్ధతులను ఎంచుకోవడం, పాపిల్లోమావైరస్‌ హెపటైటిస్‌ బి టీకాలు వేయించు కోవడం, తగినంత వ్యాయామం ఆహారం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం ఆందోళనను అదుపులో ఉంచుకోవడం, హానికరమైన రసాయనాలు, అధిక వేడి, రేడియేషన్‌ కు గురికావడాన్ని పరిమితం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం వంటివి చికిత్సలో భాగంగా ఉన్నాయి. అయితే ఇలాంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్ని జంటలు ఇప్పటికీ ప్రతికూల ఫలితాలను చవిచూస్తున్నాయి.

ఈ ఫలితాలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, ఇవి రోగికి సంబంధించినవి చికిత్సకు సంబంధించినవి కావచ్చు, అలాగే కేసును బట్టి ఈ ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి, ఐవీఎఫ్‌ ద్వారా తల్లిదండ్రులుగా మారాలనుకున్నప్పుడు, పలు అంశాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ఐవీఎఫ్‌ విజయానికి తోడ్పడే కొన్ని ప్రధాన అంశాలు:
విజయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలలో వయస్సు ఒకటి. సాధారణంగా, చిన్న వయసు మహిళలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెరుగైన అండ నాణ్యత అండాశయ నిల్వల కారణంగా 30 ఏళ్లలోపు మహిళలు, పెద్ద వయసు మహిళలతో పోలిస్తే ఎక్కువ విజయవంతమైన రేటును కలిగి ఉంటారు. ఈ వయసు వారిలో దాదాపు 50 నుంచి 60శాతం సక్సెస్‌ రేటు ఉంది.

కొన్ని జీవనశైలి కారకాలు ఐవీఎఫ్‌ విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఆరోగ్యకరమైన శరీర బరువు, ధూమపానం అధిక ఆల్కహాల్‌ వినియోగం కు దూరంగా ఉండటం సమతుల ఆహారాన్ని తీసుకోవటం వంటివి చికిత్స ఫలితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.

పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ ఎండోమెట్రియోసిస్‌ లేదా గర్భాశయ అసాధారణతలు వంటి పరిస్థితులు వంటి కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య కారకాలు ఐవీఎఫ్‌ ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు. చికిత్సకు ముందు ఈ సమస్యలను పరిష్కరిస్తే అది ఫలితాలను మెరుగుపరుస్తుంది.

మునుపటి గర్భధారణ అనుభవాల ద్వారా కూడా ఇది ప్రభావితమవుతుంది, ఇందులో మునుపటి విజయవంతమైన గర్భాలు లేదా గర్భస్రావాలు కూడా ఉంటాయి.పునరావృత గర్భధారణ నష్టం లేదా ఇంప్లాంటేషన్‌ వైఫల్యాలు వంటి అంశాలు దీని ఫలితాలను ప్రభావితం చేయవచ్చు.

చికిత్స సమయంలో ఉపయోగించే స్పెర్మ్‌ (వీర్య కణాల) నాణ్యత పరిమాణం విజయ శాతం ను ప్రభావితం చేయవచ్చు. మేల్‌ ఫ్యాక్టర్‌ వంధ్యత్వం ఆందోళన కలిగిస్తే, ఫలదీకరణంలో సహాయపడటానికి ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ (ఐఇ ఐ) వంటి ఇతర పద్ధతులు అవసరం అవుతాయి.

ఐవీఎఫ్‌ చికిత్స సమయంలో బదిలీ అయిన పిండాల నాణ్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తగిన సంఖ్యలో కణాలు,అధిక నాణ్యత కలిగిన పిండాలు ఇంప్లాంటేషన్‌ తదుపరి గర్భధారణకు మంచి అవకాశాలను కలిగి ఉంటాయి. అలాగే పిండాల సంఖ్య కూడా విజయ శాతాన్ని ప్రభావితం చేస్తుంది.

మానసిక కారకాలు కూడా ఐవీఎఫ్‌ విజయంపై ప్రభావం చూపుతాయి. ఒత్తిడిని తొలగించుకోవడం, సానుకూల మనస్తత్వాన్ని అలవరచుకోవడం మెరుగైన చికిత్స ఫలితాలకు దోహదం చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు