NCRలో ప్రత్యేక వార్డులు : చైనాలో 300మంది కోసం భారత్ కసరత్తు!

  • Publish Date - January 30, 2020 / 07:20 AM IST

చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్‌లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేశారు.

వుహాన్ సిటీలో మొదలైన (NCoV-2019) నోవెల్ కరోనా వైరస్ విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ చైనాలో 132 మంది మరణించారు. మరో 5,974 మందికి వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో ఉంటున్న 300 మంది భారతీయ పౌరుల్లో 200 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు.

ఎలాంటి లక్షణాలు లేకుంటేనే అనుమతి :
అయితే వీరిలో ఎవరికి కరోనా వైరస్ లక్షణాలు లేనిపక్షంలో మాత్రమే చైనాను వదిలి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. మరోవైపు భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత యంత్రాంగం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇదివరకే దేశ రాజధాని న్యూఢిల్లీలోని NCR పరిధిలో నిర్మూనుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేసింది. చైనా నుంచి తీసుకొచ్చే ఈ 300 మంది పౌరులను ఈ వార్డుల్లోకి తరలించేందుకు కేంద్ర రక్షణ, కార్మిక మంత్రిత్వ శాఖలు, మానేసర్ లోని ఇండో-టిబెటన్ పోలీసులతో పాటు NCR పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

చైనాకు 2 విమానాలు రెడీ.. ఆదేశాలే ఆలస్యం :
చైనా వెళ్లేందుకు ఇప్పటికే రెండు విమానాలు సిబ్బందితో సిద్ధంగా ఉన్నాయని, తుది ఆదేశాలు రావడమే ఆలస్యమని, గురువారమే విమానాలు చైనాకు బయల్దేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చైనాకు వెళ్లే సమయంలో విమానంలోని సిబ్బందితో పాటు 300 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రత్యేకమైన N95 మాస్క్‌లను వినియోగించనున్నారు. ఇదివరకే ప్రపంచంలోని ఇతర 14 దేశాల్లో పాజిటీవ్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారత్ కు తీసుకొచ్చే 300 మందిలో ఎవరికైనా వైరస్ సోకిందా అనేదానిపై చైనా నుంచి ఎలాంటి సమాచారం లేదు.
Read Also : కరోనా ఎఫెక్ట్: చైనీయులు, సందర్శకులకు వీసా కష్టాలు.. నో ఎంట్రీ..!

‘వుహాన్ నుంచి 200 మంది విద్యార్థులను తరలించడమే మా ప్రాధాన్యత. దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విద్యార్థుల విషయంలో దగ్గరగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత సమయం వరకు వీరిని ప్రత్యేక ప్రదేశాల్లో నిర్బంధంలో ఉంచాల్సి ఉంది. ఢిల్లీ సమీపంలోని నిర్మూనుష్య ప్రాంతాల్లో స్పెషల్ వార్డుల సదుపాయాలకు రక్షణ మంత్రిత్వశాఖలు, కార్మిక, ITBTల నుంచి సాయం కోరుతున్నాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ సంక్షేమ కార్యదర్శి ప్రీతి సూదన్ తెలిపారు.

200 మంది విద్యార్థులే తొలి ప్రాధాన్యం :
చైనాలో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కచ్చితంగా ఎంతమంది భారతీయులు ఉన్నారు అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. అప్పటివరకూ ప్రాధాన్యత మేరకు 200 మంది మెడికల్ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. చైనాలోని భారత ఎంబసీతో నిరంతరాయంగా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాం’ అని ఆమె అన్నారు.

చైనా నుంచి భారత్ కు తరలించే పౌరులందరిని ప్రత్యేక వార్డుల్లోకి తరలించి కనీసం 14 రోజుల పాటు పర్యవేక్షించనున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు, భారత ప్రభుత్వం తమ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు రెండు విమానాలను పంపేందుకు చైనా అనుమతి కోరినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.

వారికి 28 రోజులు నిర్బంధం తప్పదు :
చైనా నుంచి తరలించిన వారిలో ఎవరికైనా అనుమానిత వైరస్ లక్షణాలు ఉంటే వారిని 28 రోజుల వరకు పర్యవేక్షించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ తమ అపెక్స్ ల్యాబరేటరీలో బాధితుల శాంపిల్స్ టెస్టింగ్ చేస్తోంది. ఇది పుణెలోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉంది.

ఇందులో కనీసం 5వేల శాంపిల్స్ వరకు టెస్టింగ్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ కిట్స్ సరిపోతాయని, అవసరమైతే మరిన్ని విస్తరించేందుకు ప్రాసెస్ జరుగుతోందని అన్నారు. టెస్టింగ్ శాంపిల్స్ కోసం ఇప్పటికే 4 ల్యాబులు ఉండగా, అవసరమైతే 10 ల్యాబుల వరకు విస్తరించనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also :సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!