స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి ఈ వైరస్ గాలి ద్వారా జంతువులకు,మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని చెబుతున్నారు. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాప్తిని అరికట్టడానికి చిక్కమగళూరు జిల్లాలో ఏకంగా పర్యాటకుల రాకను నిషేధించారు.
రాష్ట్రంలో పలుజిల్లాల్లో మంకీ ఫీవర్ వ్యాపిస్తోంది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ తదితర జిల్లాల్లో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక విదేశీ పర్యాటక మహిళకు సోకింది. ఇప్పటికే పదిమంది వరకూ బలి తీసుకున్న మంకీ ఫీవర్ ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకానికి వచ్చిన నేపాల్ మహిళకు వ్యాపించింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుమాటాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల్‌లోని (KMC) ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు 150 మందికి పైగా వైరస్ సోకింది. మరోవైపు మంకీ ఫీవర్ విస్తరించకుండా చిక్కమగళూరు జిల్లాలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు.
మంకీ ఫీవర్ లక్షణాలు:
*వైరస్ సోకిన తర్వాత ఒక వారం వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు.
*వారం తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, కండరాల తిమ్మిరి, వాంతులు కనిపిస్తాయి.
*వ్యాధి తీవ్రతరమయ్యాక నోరు, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది.
*బీపీ, ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది.
*వ్యాధి ముదిరితే మతిస్థిమితం కోల్పోవచ్చు.