Energy Drinks Ban
Energy Drinks Ban : పిల్లల ఆరోగ్యమే ప్రధానంగా పంజాబ్ ప్రభుత్వం ముందుకువెళ్తోంది. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీ క్యాంటీన్లలో ఎనర్జీ డ్రింక్స్ నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘ఈట్ రైట్’ ఫెయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా పంజాబ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ ఈ ప్రకటన చేశారు.
పంజాబ్‌లోని స్కూళ్లు, కాలేజీల క్యాంటీన్‌లలో ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ నిషేధించనున్నారు. ప్రత్యేకించి విద్యాసంస్థలకు 500 మీటర్ల పరిధిలో ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై కూడా నిషేధించనున్నారు. పంజాబ్‌లో యువత జీవనశైలిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. మైనర్లకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధించడంపై పంజాబ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఎనర్జీ డ్రింక్స్ బ్యాన్ చేయడంపై త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. నిషేధానికి ముందు ప్రభుత్వం చట్టపరమైన పరిశీలనను కోరుతోంది. ఎందుకంటే.. ఒకవేళ ఈ నిషేధం అమల్లోకి వస్తే.. దేశంలో ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం విధించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలుస్తుంది.
వాస్తవానికి, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్, టౌరిన్ అధికంగా ఉంటాయి. ఈ డ్రింక్స్ పిల్లలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలా మంది పిల్లలు ఈ పానీయాలకు బానిసలవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
కెఫిన్ స్థాయిలు మూడు రెట్లు ఎక్కువ :
ఈ పానీయాలలో కెఫిన్ స్థాయిలు సాధారణ ఎరేటెడ్ కోలాస్ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పరిమితి కన్నా మించిపోయినట్టు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ ఈ నిషేధాన్ని ఆమోదించారు.
నోటిఫికేషన్ జారీకి ముందు నిషేధాన్ని చట్టబద్ధంగా ఎలా సమర్థించాలో న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. కొన్ని దేశాలలో ఈ పానీయాలు 15 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అమ్మరాదు” అని ఒక అధికారి తెలిపారు. ఇదే అంశంపై సింగ్ రాష్ట్ర మాదకద్రవ్యాలపై పర్యవేక్షించే క్యాబినెట్ ప్యానెల్‌తో చర్చించారు. ఇటీవల పాఠశాలలను సందర్శించినప్పుడు, విద్యార్థులు ఎనర్జీ డ్రింక్స్‌కు బానిసలవుతున్నారని మంత్రి దృష్టికి వచ్చింది.
అందులోనూ ఈ ఎనర్జీ డ్రింక్స్ ధర బాటిల్‌కు దాదాపు రూ. 20కు విక్రయిస్తున్నారు. స్ట్రాబెర్రీ క్యాండీల మాదిరి “స్ట్రాబెర్రీ క్విక్” డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి డ్రింక్స్ కారణంగా పాఠశాల స్థాయిలోనే మాదకద్రవ్య వ్యసనం ప్రారంభమవుతోందని, అలాంటి పానీయాల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించాలని మంత్రి సింగ్ పేర్కొన్నారు.
ఈ డ్రింక్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు :
మార్కెట్లో కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుందన్నారు. పిల్లల హార్ట్ రేట్ పెరుగుదల, ఆందోళన, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తాయి. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు ఈ పానీయాలు తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరించిందని ఆయన అన్నారు.
ఈ ఎనర్జీ డ్రింక్స్ బదులుగా లస్సీ, నిమ్మరసం, పళ్లరసాలు, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా, చిరు ధాన్యాలు, సేంద్రీయ ఆహారాల ప్రాముఖ్యతను కూడా డాక్టర్ సింగ్ వివరించారు. బజ్రా, కాంగ్ని, కోద్రా, జోవర్, సాన్వాన్, రాగి వంటి తృణధాన్యాల వినియోగాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
Read Also : BSNL Offers : BSNL బంపర్ ఆఫర్.. ఏకంగా 150 రోజుల ప్లాన్.. OTT బెనిఫిట్స్, దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్..!
శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ ధాన్యాలను పండించడం వల్ల నీరు ఆదా కావడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం కూడా లభిస్తుందని చెప్పారు. ఈ పోషకాలు అధికంగా ఉండే ధాన్యాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్య వ్యసనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయాలని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను కోరారు.