గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యి బస్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం… మిగులు సిబ్బంది వినియోగంపై సమాలోచనలు చేస్తోంది. వారందర్నీ సంస్థలో ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. సిబ్బంది సర్దుబాటు వ్యవహారాలు చూసేందుకు ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో వెయ్యి బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గ్రేటర్ జోన్‌లో ఆయా బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది విధులు లేకుండా ఉండిపోతారు. బస్సులు రద్దు చేయడం వల్ల విధులకు దూరంగా ఉండే వారి సేవలను వినియోగించుకోవడంపై ఆర్టీసీ అధికారులు దృష్టిసారించారు. ఈ విధంగా ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈడీలతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. అడ్మినిస్ట్రేషన్ ఈడీని దీనికి కన్వీనర్ గా… మిగితా ఈడీలతో పాటు ఆర్టీసీ ఆర్థిక సలహాదారు ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు. వీరంతా వెయ్యి బస్సులు రద్దైతే మిగులు సిబ్బందిని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై డిసెంబర్ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
డబుల్ డ్యూటీలు, ఓటీ విధులను తొలగించడం, ట్రాఫిక్, పార్కింగ్ విధుల్లో పొరుగు సేవల వినియోగం కోసం మెకానికల్ విభాగాన్ని వినియోగించుకోవాలని ఈడీ కమిటీ సభ్యులు సూచించారు. అద్దె బస్సులతో పాటు త్వరలో ఆర్టీసీ తీసుకురాబోతున్న రవాణా సేవలకు అదనపు డ్రైవర్లను, కండక్టర్లను వినియోగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లను వీలైతే బస్సుల సమయపాలన పాటించడం, ఆదాయ మార్గాలను పెంచడం, బస్సుల తనిఖీ చేయడం లాంటివి పనులకు వాడుకోవడంపై ఆలోచన చేయాలని సూచించారు. కండక్టర్లను పొరుగుసేవల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా తీసుకోవాలని చూస్తున్నారు. సరైన అర్హతలు ఉన్నవారిని జూనియర్ అసిస్టెంట్‌లుగా తీసుకోవాలని అనుకుంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉన్న 33 మంది సివిల్ ఇంజనీర్లను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని భావిస్తున్నారు.