హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల
హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే డిస్కషన్. దీనికి కారణం రూ.2వేల రూపాయల నోటు కనిపించకుండా పోవడమే. అవును.. 2వేల రూపాయల నోట్లు మిస్ అయ్యాయి.
సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ రూ.2వేల నోటుపై పడింది. బ్యాంకుల్లో, మార్కెట్ లో రూ.2వేల నోట్లు కనిపించడం లేదు. దీంతో బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో నగదు అక్రమ రవాణ చేసేందుకు, ఓటర్లకు పంచేందుకు రూ.2వేల నోటుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో నెల రోజుల నుంచే తెలుగు రాష్ట్రాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. వీరంతా ఆయా బ్యాంకుల నుంచి రూ.2వేల నోట్ల కట్టలను తెప్పించుకుని దాచుకున్నట్లు సమాచారం.
కొంతమంది బ్యాంకు ఉద్యోగులు రాజకీయ నేతలతో కుమ్మక్కై బ్యాంకులో డిపాజిట్ల రూపంలో వచ్చిన రూ.2వేల నోట్ల బండిల్స్ ను వారికి అందజేసినట్లు తెలుస్తోంది. ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాక్, ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ.. ఇలా బ్యాంకు ఏదైనా.. రూ.2వేల నోట్ల కట్టలు మాత్రం లేవు. వీటి స్థానంలో రూ.500 నోట్లు కుప్పలుగా వస్తున్నాయి. దీంతో వాటిని లెక్కించడానికి బ్యాంక్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే డబ్బులోనూ రూ.500 నోట్లే వస్తుండటంతో ఖాతాదారులూ పాట్లు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారం అంటే ఒక్కో అభ్యర్థి కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిందే. ఈ డబ్బుకి సరైన ఖర్చు ఉండదు. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు ఎక్కువ శాతం బ్లాక్ మనీ. ఈ క్రమంలో డబ్బుని ఆయా నియోజకవర్గాలు, ప్రాంతాల్లోని కార్యకర్తలు, నేతలకు తరలించాలంటే ఎక్కువ విలుగ గల నోట్లు ఉంటేనే వెసులుబాటు ఉంటుందని గ్రహించిన నేతలు రూ.2వేల నోట్లను ముందే దాచేశారట.
హైదరాబాద్ లోని వందల బ్యాంకుల్లోనే కాదు.. జిల్లా కేంద్రాల్లో ఉన్న బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. 2వేల రూపాయల నోట్లు కనిపించడం లేదు. ఒక్కో బ్యాంకులో ప్రతి రోజు కనీపం 50 నుంచి వందకు పైగా దర్శనమిచ్చే రూ.2వేల నోట్లు.. ఇప్పుడు కేవలం 10 నుంచి 15 మాత్రమే కనిపిస్తున్నాయని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు వందల కోట్ల రూపాయలు కుమ్మరించటానికి కూడా సిద్ధం అయ్యారు.
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని తీసుకుంటే ఈ ఖర్చు వందల కోట్లలో ఉంటుంది. ఇదంతా అనధికారం. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలంటే చిల్లర కష్టం. అందుకే రూ.2వేల నోటు రూపంలో అంత డబ్బు దాక్కుంది. పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి అనధికారికంగా పంపకాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఈ లెక్కన.. రూ.2వేల నోటు మళ్లీ మార్కెట్ లో కళకళలాడాలి అంటే.. ఏప్రిల్ 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.