శామీర్‌పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
శామీర్‌పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి వన భోజనాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీలో చేపడుతున్న సంస్కరణలు.. ఇచ్చిన హామీల అమలుపై ఉద్యోగస్తులకు ఈ కార్యక్రమం ద్వారా మంత్రి పువ్వాడ అజయ్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. శామీర్‌పేట బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, భద్రతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని తెలిపారు.
మహిళా సిబ్బంది రాత్రి ఎనిమిది గంటల లోపు విధులు ముగించుకునేలా అధికారులను ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీసీఎస్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామన్నారు. సమ్మెకాలం జీతాన్ని మార్చిలోపు అందజేస్తామని మంత్రి అజయ్ ప్రకటించారు. అంతే కాకుండా ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుస్తులు కోరుకున్నట్లు త్వరలోనే వారికి మెరూన్ కలర్ ఆఫ్రాన్ దుస్తులను అందజేస్తామన్నారు. ఉద్యోగస్తులు కష్టపడి ఆక్యుపెన్సీ పెంచాలని.. ప్రతి ఒక్క అధికారి ఒక డిపోను దత్తత తీసుకోవాలని మంత్రి పువ్వాడ కోరారు.
జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ కార్గో సర్వీసులను ప్రారంభిస్తారన్నారు. ప్రారంభంలో పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ వంటి ప్రభుత్వ సరుకులను సరఫరా చేయబోతున్నట్లు కార్గో బస్సుల మార్కెటింగ్ నిర్వాహకులు తెలిపారు. క్రమక్రమంగా నిత్యావసర సరుకులతో పాటు మద్యం.. మందులు కూడా సరఫరా చేస్తామని.. ప్రైవేటు కార్గోలతో పోల్చుకుంటే.. ఆర్టీసీ కార్గో సర్వీసుల ధర తక్కువగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
కొందరు ఆర్టీసీని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. వారి కుట్రలను తిప్పికొట్టాలని ఉద్యోగస్తులకు పిలుపినిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు వచ్చే సంక్రాంతి నాటికి బోనస్‌లు తీసుకోవాలని.. అందుకు తగ్గట్లే అందరూ కష్టపడి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్నారు. సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉద్యోగస్తుల కోసం ఏర్పాటు చేసిన సంచార టాయిలెట్లను మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రారంభించారు.
విధులు మారే చోట టాయిలెట్లు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళా ఉద్యోగులు తెలిపారు. సంచార టాయిలెట్లు అందుబాటులోకి తీసుకురావడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జేబీఎస్‌లో సంచార టాయిలెట్లు.. కార్గో బస్సులను మంత్రులు పరిశీలించారు. 15 సంచార టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు.