ఐటీ గ్రిడ్స్‌పై FIR : 7.8కోట్ల మంది ఆధార్ వివరాలు లభ్యం

  • Publish Date - April 14, 2019 / 06:32 AM IST

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) అధికారుల ఫిర్యాదు మేరకు వారు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఆధార్‌ కార్డు చట్టంలోని 37, 38, 40, 42, 44 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ఆధార్‌ సమాచారం లభించడంతో అదెలా వచ్చిందో తెలపాలని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు.. వివరణ కోరుతూ ఢిల్లీలోని ఆధార్‌ కేంద్రం అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన యూఐడీఏఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

టీడీసీకి సేవా మిత్ర యాప్ ను అభివృద్ధి చేసిచ్చిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 7.80 కోట్ల మంది ఆధార్ వివరాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 8.40 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 90 శాతానికి పైగా ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్స్ దగ్గర ఉందని తేల్చారు. ఈ డేటాను ఆధార్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా రిమూవబుల్ స్టోరేజ్ డిస్క్ లలో భద్రపరిచారని, చట్టవిరుద్ధంగానే ఈ డేటాను వారు సేకరించారని చెప్పారు.

ఈ కేసును మరింత విచారించాల్సి ఉందని, ఈ కేసును కూడా సిట్ కు అప్పగించాలని కోరే అవకాశాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. యూఐడీఏఐ దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం సమస్తం ఐటీ గ్రిడ్స్ దగ్గర ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై టీడీపీ వాదన మరోలా ఉంది. తాము ఆధార్ డేటాను చోరీ చెయ్యలేదని, సంక్షేమ పథకాల లబ్దిదారుల వెరిఫికేషన్ నిమిత్తం మాత్రమే వాడామని చెబుతోంది.