కల్తీ మిల్క్ : ప్లాస్టిక్‌గా మారిపోయిన పాలు

హైదరాబాద్‌లో కల్తీ పాలు కలకలం రేపింది. తాగడం కోసం వేడి చేసిన పాలు ఏకంగా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది. 

  • Publish Date - October 11, 2019 / 03:40 PM IST

హైదరాబాద్‌లో కల్తీ పాలు కలకలం రేపింది. తాగడం కోసం వేడి చేసిన పాలు ఏకంగా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది. 

కల్తీ పాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో ప్రకటించారు. కానీ కల్తీ రాయుళ్లలో ఏమాత్రం మార్పు రాలేదు. అక్రమ సంపాదన కోసం కొందరు యథేచ్చగా పాలను కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కల్తీ పాలు కలకలం రేపింది. తాగడం కోసం వేడి చేసిన పాలు ఏకంగా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది. 

ప్రగతి నగర్‌ చౌరస్తాలో ఉండే సాయి తేజ మిల్క్‌ సెంటర్‌లో పవన్‌ అనే వ్యక్తి రోజూలాగే రెండు మిల్క్‌ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి గిన్నెలో ఓ ప్యాకెట్‌ పాలు పోసి స్టౌపై పెట్టాడు. ఐదు నిమిషాలు గడిచాయో లేదో.. పాలు కాస్తా.. ప్లాస్టిక్‌గా మారిపోయాయి. కంగారు పడిన పవన్‌.. గిన్నెలోనే ఫాల్ట్ ఉండొచ్చని.. మరో పాల ప్యాకెట్‌ను ఓపెన్‌ చేసి వేరే గిన్నెలో వేడి చేశాడు. ఈసారి కూడా అదే పరిస్థితి. యథావిథిగా అవి కూడా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోయాయి. దీనిపై మిల్క్‌ సెంటర్‌ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. దురుసుగా సమాధానం ఇవ్వడంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కల్తీ పాలతో అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. కేన్సర్ వంటివి సోకి క్రమంగా ప్రాణాలే పోవచ్చు. అధిక రక్తపోటు, గుండె సంబంధవ్యాధులూ రావచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. మొదడు, కాలేయం, మూత్రపిండాలపై కూడా కల్తీ పాల ప్రభావం ఉంటుంది. ఫిట్స్‌ వచ్చే అవకాశాలుంటాయి. కండరాల్లో వణుకు కూడా రావొచ్చు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు ప్రాణాలకు ముప్పు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే కల్తీ పాలను చిన్న చిట్కాతో సులభంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడికల్‌ షాపుల్లో దొరికే టింక్చర్‌ అయోడిన్‌ను తీసుకొని.. పాలల్లో వేస్తే కల్తీవో కావో తెలుస్తుందని అంటున్నారు. అయోడిన్‌ వేశాకా పాలు పసుపు రంగులోకి మారితే అవి మంచి పాల కింద లెక్క. ఒక వేళ అవి నీలం రంగులోకి మారితే మాత్రం అవి కల్తీ పాలేనని చెబుతున్నారు. నిత్యవసరంగా మారిన పాలలోనూ కల్తీ జరగడం తీవ్రంగా పరిగణించాల్సి విషయం. ఇలాంటి కల్తీలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.