దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్‌కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
ఏ కష్టం వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా.. హండ్రెడ్ నెంబర్‌కు ఫోన్ కొడుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో రోజుకు సగటున హండ్రెడ్ నెంబర్‌కు 50వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎప్పుడైతే, దిశ ఘటన జరిగిందో వీటి సంఖ్య ఏకంగా మరో 30వేలు పెరిగింది. అంటే, రోజుకు ఎంత లేదన్నా 80వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తెలంగాణలో డయల్ హండ్రెడ్‌పై అవగాహన పెరగడంతో.. సిబ్బందిని పెంచారు పోలీసులు.
హండ్రెడ్‌కు డయల్ చేసిన వారికి ఓ భరోసా ఇస్తున్నారు పోలీసులు. ఏదైనా కష్టం వచ్చి ఫోన్ చేస్తే.. కేవలం 6 నుంచి 8 నిమిషాల్లోనే మీ ముందు నిల్చుంటామని ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వందకు డయల్ చేస్తే పది నిమిషాలకు అటుఇటుగా పోలీసులు వచ్చేవారు.
అయితే, దిశ ఘటన తరువాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. గస్తీ వాహనాలకు మరింత అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఉంటే తప్ప ఎనిమిది నిమిషాల్లోపే బాధితుల వద్దకు చేరుకుంటున్నామన్నారు పోలీసులు. అదే గ్రామాల్లో అయితే పది నుంచి 12 నిమిషాలు పడుతోందని పోలీసులు చెబుతున్నారు.
ఇప్పుడంతా స్మార్టే. అందుకే, యాప్స్‌ను సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. పోలీసుల నుంచి తక్షణ సాయం, రక్షణ కావాలంటే.. డిపార్ట్‌మెంట్ రూపొందించిన హాక్ ఐ అనే యాప్ ఉంటే చాలు. ఇందులో ఏమీ చేయక్కర్లేదు. హాక్ ఐ యాప్‌లోని S.O.S అనే చోట నొక్కితే చాలు.
పోలీసులు ఇక మీ వెంట ఉన్నట్టే. దిశ ఘటన తరువాత హాక్ ఐ యాప్ డౌన్‌లోడ్స్ కూడా పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే రెండున్నర లక్షల మొబైల్స్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాక్ ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో 70 శాతం హైదరాబాద్ వాళ్లే.
ఈ యాప్ ఉన్న వాళ్లు S.O.S ఆప్షన్‌ను నొక్కి పోలీసులు తమను గుర్తిస్తున్నారా లేదా అని పరీక్షించారట. కొందరు యువతులు తాము వెళ్తున్న ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే ముందు S.O.Sను నొక్కి గమ్యస్థానాలకు చేరుకున్నాక క్షేమంగా చేరుకున్నామంటూ మెసేజ్ పెట్టారట. ఏదేమైనా సేఫ్టీపై జనాల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా మహిళలు, కాలేజ్ స్టూడెంట్స్‌లో ఈ అవేర్‌నెస్ కనిపిస్తోంది.