తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్‌ : కొత్త పథకాల ప్రకటనకు ఆటంకం 

తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వెళ్లబోతోంది. దాదాపు ఆరు నెలల పాటు వరుసగా ఎన్నికలే ఉన్నాయి.

  • Publish Date - February 11, 2019 / 04:09 PM IST

తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వెళ్లబోతోంది. దాదాపు ఆరు నెలల పాటు వరుసగా ఎన్నికలే ఉన్నాయి.

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వెళ్లబోతోంది. దాదాపు ఆరు నెలల పాటు వరుసగా ఎన్నికలే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో గత ఏడాది రెండు నెలలపాటు కోడ్‌ అమలైంది. ఆ తర్వాత డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో గత నెలాఖరు వరకు కోడ్‌ అమల్లో ఉంది. త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. దీంతో మరోసారి కోడ్‌ అమల్లోకి  వస్తుంది. వరుసగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది.

ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారింది. వరుస ఎన్నికలతో వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండబోతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ఏడాది రెండు నెలలపాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలతో మరోసారి కోడ్‌ కూసింది. ఈ నెలాఖరు నుంచి లోక్‌సభ ఎన్నికల  ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. శాసనమండలి ఎన్నికలతోపాటు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ ఎన్నికలు, మండల ప్రజా పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో వచ్చే ఆరు నెలలపాటు ఎన్నికల కోడ్‌ పరిధిలో ఉండక తప్పని పరిస్థితులున్నాయి. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉండదు. అటు అమల్లో ఉన్న పథకాలు కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతుబంధు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సామాజిక పెన్షన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డువచ్చే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆరు నెలలపాటు ఇది ఇబ్బందికర పరిణామంగానే విశ్లేషకులు భావిస్తున్నారు.