మొత్తం 8 స్టేషన్లు : అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో రూట్ మ్యాప్

  • Publish Date - March 7, 2019 / 06:21 AM IST

అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హైటెక్ సిటీ నుంచి ఇంటర్ చేంజ్ స్టేషన్ అమీర్‌పేట్‌కు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమీర్‌పేట్-హైటెక్ సిటీ వరకు 11 కిమీల దూరం ఉంటుంది. మెట్రో మొదటి దశలో ఇప్పటికే నాగోల్-అమీర్‌పేట్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాలు ప్రారంభమయ్యాయి. ఆ మార్గాల్లో 64 మెట్రోస్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలోని 72 కిలోమీటర్లలో 46 కిలోమీటర్ల మేర మెట్రో పూర్తయింది. అమీర్‌పేట్, హైటెక్‌సిటీ మధ్య 11 కిలోమీటర్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. మొదటి దశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.

అమీర్‌పేట్-హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ను ప్రారంభించేందుకు.. హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌(HMRL) ఇంజనీర్లు, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఇంజనీర్లు పెండింగ్‌ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రూట్‌లో 8 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

మధురానగర్: స్టేట్‌ హోం వద్ద మెట్రో స్టేషన్‌కు మధురానగర్‌-తురుణీ మెట్రో స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. 2 ఎకరాల్లో తరుణి మార్కెట్‌ పేరుతో మహిళలే నిర్వహించేలా వస్తువుల విక్రయ శాలలను ఏర్పాటు చేస్తున్నారు. 40 కార్లు, 400 టూవీలర్స్ పార్కింగ్‌ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నుమాయిష్‌ తరహాలో ఇక్కడ 150 స్టాళ్లను ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలకు అవసరమైన వస్తువుల ఉత్పత్తులను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 
యూసుఫ్ గూడ: అమీర్ పేట్, జూబ్లీహిల్స్ మధ్య ప్రయాణించే వారికి వెసులుబాటుగా ఈ స్టేషన్ ఉండనుంది.

జూబ్లీహిల్స్ రోడ్ నెం 5: కార్పొరేట్ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో.. ప్రయాణికులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్: ఈ మెట్రో స్టేషన్‌లో మొదటి అంతస్తులోనే ప్లాట్‌ఫాం ఉండడంతో రద్దీ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ మేనేజర్స్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేసేలా చూస్తున్నారు.

పెద్దమ్మ టెంపుల్: ప్రముఖ ఆలయం. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. నిత్యం రాకపోకలు ఉంటాయి. వ్యాపార సంస్థలు, పలు ఆఫీసులు కూడా ఉన్నాయి. వారందరికి సౌలభ్యంగా ఉండేలా ఇక్కడ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు.

మాదాపూర్: ఐటీ హబ్. పెద్ద పెద్ద కార్పొరేట్, ఐటీ కంపెనీలకు నిలయమైన ఈ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఎక్కువే. ఐటీ ఉద్యోగులు, హోటల్స్ లో పని చేసే వారి సౌలభ్యం కోసం ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో నీరూస్‌ షోరూమ్‌కు వంద మీటర్ల దూరంలో హెచ్‌ఎంఆర్‌ సేకరించిన స్థలాన్ని చదును చేసి పార్కింగ్‌కు వీలుగా అభివృద్ధి చేస్తున్నారు.

దుర్గం చెరువు: దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆస్తుల సేకరణ కోసం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్కడి స్థల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  స్టేషన్‌ చుట్టు అవసరమైన స్థలాలను నిర్ణీత సమయంతో సేకరించి పార్కింగ్‌, ఇతర అవసరాలకు వినియోగించేలా చేస్తున్నారు. ఈ స్టేషన్‌ నుంచి ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సంస్థతో సంప్రదింపులు జరిపి ఐటీ ఉద్యోగుల కోసం షటిల్‌ సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

హైటెక్ సిటీ: సైబర్ టవర్స్ జంక్షన్. ఐటీ కంపెనీల అడ్డా. నగరంలోని దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వస్తుంటారు. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి నుంచి కనెక్టివిటీ ఉంది. హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ వద్ద రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా సూచికల బోర్డులను, పక్కనే ఉన్న ఎల్‌ అండ్‌ టీ మాల్‌ లో మెట్రో ప్రయాణికుల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.