మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపై కేసు నమోదైంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ యాజమాన్యంపై కేసు నమోదైంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించి ఓ మహిళ మృతికి కారణమైన.. ఎల్ అండ్ టీ యాజమాన్యంపై 304ఎ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 304ఏ అంటే నిరక్ష్యం కారణంగా జరిగిన మరణం. మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని హరికాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఆదివారం(సెప్టెంబర్ 22,2019) అమీర్ పేట మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. మెట్రోలో వెళ్లమని తాను బలవంతం చేయడం వల్లే మౌనిక చనిపోయిందని హరికాంత్ విలపించారు. మౌనిక సోదరి ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌కి వచ్చింది. హాస్టల్లో ఉండి చదువుకుంటానని ఆమె చెప్పడంతో… అమీర్‌పేట్‌లోని ఓ మంచి హాస్టల్‌లో చేర్పించేందుకు మౌనిక బయల్దేరింది.
మౌనిక బస్సులో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా… ఆమె భర్త హరికాంత్ మెట్రోలో తొందరగా అమీర్‌పేట్ వెళ్లి ఇంటికి రావొచ్చని సూచించారు. మెట్రో తనకు అలవాటు లేదని… బస్సులోనే వెళ్తానని చెప్పిన మౌనికను.. హరికాంత్ బలవంతంగా ఒప్పించారు. మెట్రోలో వెళ్తే తక్కువ టైమ్‌లో పని పూర్తి చేసుకొని రావొచ్చని చెప్పారు. దీంతో తన సోదరితో కలిసి మౌనిక మెట్రోలో ప్రయాణించింది. స్వయంగా హరికాంత్.. వారిద్దరిని కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కించారు. అదే.. మౌనిక పాలిట మృత్యువైంది.
మౌనిక మృతిపై ఆమె కుటుంబసభ్యులతో ఎల్అండ్‌టీ అధికారులు చర్చలు జరిపారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు, రూ.10 నుంచి 15 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు ఇచ్చేందుకు ఎల్‌అండ్‌టీ అధికారులు అంగీకరించారు. అలాగే మౌనిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.