మీ వెంటే : ఆర్టీసీ సమ్మెకు APSRTC సంఘాల మద్దతు

  • Publish Date - October 15, 2019 / 11:30 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అక్టోబర్ 19న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతు తెలియజేస్తామని చెప్పారు. బలిదానాలతో కాదు.. పోరాటాలతోనే డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని నేతలు కోరారు. 

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 11వ రోజుకు చేరిందని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు చాలా అన్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే అణిచి వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆంధ్ర పాలకులు ఉండేవాళ్లు అన్యాయం చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ స్వతంత్రంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాక కార్మికులకు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మికుల ఉద్యమాన్ని అణిచివేసే విధంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనల వల్ల కార్మికులు ఆందోళన చెంది, ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. 

ధైర్యంగా ఉండండి..మీ వెనుక ఆంధ్ర కార్మికులు ఉన్నారని భరోసా ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు. అవసరమైతే దేశ వ్యాప్తంగా ఉన్న రవాణా కార్మిక సంఘాలు మీ వెంటే ఉంటాయని చెప్పారు. న్యాయమైన పోరాటానికి తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అక్టోబర్ 19న తెలంగాణ బంద్ చేపడితే ఏపీలో ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పారు. 

కార్మికుల ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించకుండా కేసీఆర్ సమ్మె వైపు నెట్టారని చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చి 35 రోజులైనప్పటికీ కూడా కార్మిక సంఘాలను చర్చలకు పిలువకుండా ప్రభుత్వం, రవాణా శాఖ, యాజమాన్యం సమ్మె వైపు నెట్టారని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నో సార్లు సమ్మెలు జరిగాయి కానీ ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి లేదన్నారు. వెంటనే ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.