TRS పార్టీలో పదవుల పంపిణీపై అలకలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత.. ఆశావహులు అజ్ణాతంలోకి వెళ్లారు. పార్టీ నేతలకు టచ్ లో లేరు. హామీ ఇచ్చిన అధిష్టానంపై అలక వహిస్తున్నారు. నిన్నటికి నిన్న జోగు రామన్న, ఇప్పుడు అరికెపూడి గాంధీ పార్టీ వైఖరిపై అలిగారు. మంత్రి పదవి దక్కలేదంటూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేరు.
అదే బాటలో.. మంత్రి ఆశించి భంగపడిన హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. గన్ మెన్లను సైతం సరెండర్ చేశారు ఎమ్మెల్యే. అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడనంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను కలిసి తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు గాంధీ.
మంత్రి పదవి ఆశించిన అరికెపూడి గాంధీకి సీఎం కేసీఆర్ విప్ పదవి కట్టబెట్టారు. అయితే ఆ పదవిపై అసంతృప్తిగా ఉన్న గాంధీ.. మంత్రి పదవిపైనే పట్టుబడుతున్నారంట. తన సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి కట్టబెట్టడంపైనా.. గాంధీ తన నిరసన వ్యక్తం చేస్తున్నారంట. వయసు, అనుభవం చూసుకున్నా.. నేను సీనియర్ లీడర్ ను.. నాకే ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని క్వశ్చన్ రైజ్ చేస్తున్నట్లు సమాచారం. పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి ఇచ్చి.. తనకు ఇవ్వకపోవటంపై సన్నిహితుల దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం మంత్రి కేటీఆర్ ను కలిసి తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్… గాంధీని బుజ్జగించి ఇందుకు సంబంధించి మాట్లాడదామని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ లో మంత్రివర్గ విస్తరణ, చీఫ్ విప్, విప్ కేటాయింపులు పదవులు ఆశించిన నేతల్లో అసంతృప్తిని రగిలించిందని చెప్పవచ్చు.
మాజీ హోంమంత్రి నాయిని కూడా ఇప్పటికే అసంతృప్త గళం వినిపించారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు నాయినీ నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రెడ్యానాయక్, ఆరూరి రమేశ్‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించారు.
వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు ఖచ్చితంగా వస్తాయని ప్రచారం జరిగింది. అలా జరగలేదు. ఈ క్రమంలోనే కొందరు గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : అతడి ఆటోనే 108 : పిలిస్తే చాలు.. ఆపదలో ఆదుకుంటాడు!