బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా సేవలు నిలిపేసి సమ్మె చేయనున్నట్టు బ్యాంకు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీ సుక్కయ్య ప్రకటించారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న బ్యాంకులను కేంద్రం విలీనం చేస్తూ ఖాతాదారులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు.
దీన్ని వ్యతిరేకిస్తూ 48 గంటలపాటు సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంకులు సమ్మెలో పాల్గొనవని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐబీవోసీ కార్యదర్శి జీ నాగేశ్వర్‌రావు, ఏఐబీవోఏ ప్రధాన కార్యదర్శి అనిల్, ఐఎన్బీవోసీ ప్రధాన కార్యదర్శి బీ అర్జున్, ఎన్‌వోబీవో ప్రధాన కార్యదర్శి హరి, జాక్ కార్యదర్శి మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.