9 రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం (అక్టోబర్ 6, 2019)వ తేదీతో ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లోనూ సద్దుల బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం నిర్వహించింది.
పదివేల మంది మహిళలు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చి, 30 అడుగుల బతుకమ్మ శకటంతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు సీఎం సతీమణి శోభ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు, మహిళా మంత్రులు, విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యారు.
ప్రతి జోన్ నుంచి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేలా 120 వాహనాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. చివరిరోజైన సద్దుల బతుకమ్మలో రకరకాల సద్దులు, సత్తులను ప్రసాదాలుగా పెట్టి, బతుకమ్మ నిమజ్జనం తర్వాత వాయినాలుగా ఇచ్చుకున్నారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆకాశానంటుతున్న తారాజువ్వలు, బాణాసంచాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుక జరిగింది. హుస్సెన్‌సాగర్‌లో బతుకమ్మల నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది..
వరంగల్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగాయి. బతుకమ్మ ముగింపు వేడుకల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గౌరమ్మకు ఘనంగా పూజలు చేసి… నిమజ్జనం చేశారు.
ఇటు కరీంనగర్‌లోని వరలక్మీ దేవి టెంపుల్ సమీపంలో బతుకమ్మ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. కోలాటాలు, చప్పట్లతో ఉత్సాహంగా పండుగ వేడుక చేసుకున్నారు.
బతుకమ్మ సంబురాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఘనంగా జరిగాయి. దేశరాజధాని అబుదాబిలో తెలంగాణ ప్రజలందరూ ఒక్కచోట చేరి అంగరంగ వైభవంగా సంబురాలు నిర్వహించారు. తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా మారింది.