వంద వర్ణాల్లో సరికొత్త డిజైన్లతో బతుకమ్మ చీరెలు 

  • Publish Date - August 31, 2019 / 05:57 AM IST

బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలను అలరించే అందమైన బతుకమ్మ. బతుకు అమ్మా..అని ఆడబిడ్డల్ని దీవించే ముచ్చటైన సంప్రదాయపు పండుగ బతుకమ్మ. ప్రతీ బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు చీరెలు ఇవ్వటం ప్రభుత్వం సంప్రదాయంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ చీరెలు సరికొత్త డిజైన్లతో రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా 100 రకాల డిజైన్లతో తయారవుతున్నాయి. 

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చినట్లు..ఈసారి ఆడబిడ్డలు కూడా తీరొక్క వర్ణాలతో కనిపించనున్నారు. బతుకమ్మ చీరెలు కట్టుకుని సందడి చేయనున్నారు. చేనేత కార్మికుల క్షేత్రం సిరిసిల్లలో వంద  వర్ణాల్లో చీరెలు ముస్తాబవుతున్నాయి. చెక్స్.. లైనింగ్ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూ. 320 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి ముమ్మరంగా సాగుతున్నది. మొత్తంగా 6 కోట్ల మీటర్ల ఉత్పత్తి లక్ష్యంలో 4కోట్ల మీటర్లు సిద్ధం చేశారు.