’సహకార’ ఎన్నికలకు మరోసారి బ్రేక్ 

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ఫ్యాక్స్)కు మరోసారి బ్రేక్ పడింది.

  • Publish Date - January 9, 2019 / 06:12 AM IST

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ఫ్యాక్స్)కు మరోసారి బ్రేక్ పడింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ఫ్యాక్స్)కు మరోసారి బ్రేక్ పడింది. ఎన్నికలను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి స్పష్టం చేశారు. 

పంచాయతీ ఎన్నికలు ముగియగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ముందుగా భావించారు. సీఎం కేసీఆర్ కూడా ఆ దిశగా అధికారులకు సంకేతాలు ఇచ్చారు. ఫిబ్రవరి రెండో వారంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 17న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎన్నికల కోసం ఫ్యాక్స్ ఓటర్ల తుది జాబితాను కూడా రూపొందించుకున్నారు.

సహకార సంఘాలకు ఎన్నికలు ముగియగానే జనవరి 25 కల్లా డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్ ల ఎన్నిక పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఆశించి భంగపడే వారిని డీసీపీబీ చైర్మన్ గా నియమించాలని అధికార పార్టీ భావిస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ఫ్యాక్స్, డీసీసీబీ ఆశావహులను ఇప్పుడు బలంగా పని చేయించుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో తాత్కాలికంగా ఫ్యాక్స్ ఎన్నికలను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం 906 ఫ్యాక్స్ లకు పర్సన్ ఇన్ చార్జీలు కొనసాగుతున్నారు. ఈ గడువు వచ్చే నెల మొదటి వారంలో ముగియనుంది. అప్పటికీ ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి తెలిపారు.