కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని చెప్పారు.
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఏఏ.. టీఆర్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నారు. ప్రస్తుతం దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత ఉందని అన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులతో సదస్సు
పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడతానని చెప్పారు. రానున్న నెలరోజుల్లో సీఏఏకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులతో సదస్సు నిర్వహిస్తానన్నారు. 16 ముఖ్యమంత్రులు, అధికారంలో లేని కొన్ని ప్రాంతీయ పార్టీలతో అందరూ బాధపడతున్నారని తెలిపారు. దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్ మన ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు మనం మౌనం పాటిస్తే దేశానికి క్షేమం కాదన్నారు.
నాకంటే పెద్ద హిందువు ఎవరు లేరు
సీఏఏను తాము వ్యతిరేకించామని, ఏది చేసినా ఆశమాసిగా చేయమన్నారు. తాము ఎవరికి భయపడమన్నారు. తాము ఏదీ చేపినా పూర్తిస్థాయి అవగాహన, స్పష్టత, నిండు మనసుతో చేస్తాం..తప్పా సగం సగం వ్యవహారం చేయమని స్పష్టం చేశారు. బీజేపీ హిందుత్వ ఎజెండాపైనా ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో తనకంటే పెద్ద హిందువు ఎవరు లేరన్నారు. తాను భయంకరమైన హిందువుని..దేశంలో తాను చేసిన యాగాలు ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు.
రాజ్యాంగంలో అన్నివర్గాల ప్రజలకు సమానమైన ప్రాథమిక హక్కులు
కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ తప్పుడు నిర్ణయం అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన రాజ్యంగమని మనం చెప్పుకున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమానమైన ప్రాథమిక హక్కులు కల్పించిందన్నారు. సీఏఏలో ముస్లీంలను పక్కకు పెడతామన్న మాట తనకు చాలా బాధ కల్గించిందన్నారు. అమిత్ షా ఫోన్ చేస్తే సపోర్టు చేయమని చాలా స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నారు.
దేశానికి ఫెడరల్ విధానమే శ్రీరామ రక్ష
దేశానికి ఏ రోజుకైనా ఫెడరల్ విధానమే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కర్ర పెత్తనాలు, మోనోపలి పనికి రాదన్నారు. భారతదేశం రాష్ట్రాల కూటమి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఎగ్జిక్యూటివ్ బాడీలు కాదని…రాజ్యాంగ బాడీలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ ప్రభుత్వాలని, రాష్ట్రాలు రాజ్యాంగ హక్కులను కలిగి ఉన్నాయని తెలిపారు.