సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ మోజులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను విశ్లేషించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నగర పౌరులకు, వాహనదారులకు పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. బాధ్యతగా ఉండాల్సిన పౌరులు, వాహనదారులు నిర్లక్ష్యంతో చేస్తున్న చిన్న తప్పు.. వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫ్లైఓవర్లపై సెల్ఫీలు, ప్రమాదకరస్థాయిలో నిలబడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
నవంబర్ 10న అర్ధరాత్రి 1.15 గంటలకు వంశీరాజ్, ప్రవీణ్‌కుమార్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఆగి సెల్ఫీ తీసుకుంటున్నారు. అలాగే మరో ఇద్దరు వాహనదారులు ఇతర కారణాలతో ఫ్లైఓవర్‌పై ప్రమాదకరమైన స్థాయిలో ఆగారు. ఇంతలో మద్యం మత్తులో కారును వేగంగా నడిపిస్తూ వారిపైకి దూసుకు వచ్చింది. వంశీరాజ్, ప్రవీణ్‌కుమార్‌లు ఫైఓవర్ పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నడిపిస్తున్న డ్రైవర్ అభిలాష్‌గా గుర్తించిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఒక్క ఫ్లైఓవరే కాదు నగరంలోని ఏ ఫ్లైఓవర్‌పైన ప్రమాదకరమైన స్థాయిలో నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మంచిది కాదని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సూచిస్తున్నారు. ఫ్లైఓవర్లపై సెల్ఫీలు, నిలబడే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
పోలీసులు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్లపై అనవసరంగా వాహనాలను నిలుపరాదు. ద్విచక్ర వాహనాలు చెడిపోయినప్పుడు.. వాటిని సురక్షితంగా ఫ్లైఓవర్ మధ్యలో కాకుండా పక్కకు తీసి కిందకు దిగాలి. కార్లు చెడిపోతే డయల్ 100కు సమాచారం అందించాలి. ఫ్లైఓవర్లపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపి.. డేంజరస్ యాక్సిడెంట్‌లకు కారణం కావద్దు. సైబరాబాద్ పరిధిలోని ఫ్లైఓవర్లపై సీసీ కెమెరాల ఏర్పాటు..వీటి ద్వారా ఫ్లైఓవర్ల మీద చిట్‌చాట్, సెల్ఫీలు దిగే వారిని, ఫ్లైఓవర్ల మీద కూర్చొని తింటున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఫ్లైఓవర్ల మీద ప్రమాదకరంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ వాట్సాప్ నెం. 8500411111 లేదా 040-24243422కు సమాచారం అందించాలి. పౌరులుగా మద్యం సేవించినప్పుడు వాహనాలను నడపవద్దు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు వాహనదారులను ప్రమాదంలోకి నెట్టుతుంది తప్పా వారికి సురక్షితం ఏ మాత్రం కాదు.. అని సూచనలు చేశారు.