హైదరాబాద్ : ఆలోచనలు స్మార్ట్..క్లాస్ రూమ్ వెరీ స్మార్ట్. ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువ. తెలంగాణ స్కూల్ విద్యాశాఖ కొత్త ఆలోచనలతో..సరికొత్త క్లాస్ రూమ్స్ కు రూపుదిద్దుకుంటున్నాయి. అవే థర్మాకోల్‌తో రూమ్స్ నిర్మాణం. ఈ నూతన సాంకేతికతను వాడి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పాఠశాలల్లో తరగతి గదులను నిర్మిస్తోంది. ఎక్స్‌పాండెడ్ పాలి స్టెరీన్(ఈపీఎస్) టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని చేపట్టింది.
ఓ గదిని నిర్మించాలంటే ఇటుకలు, సిమెంట్..ఇసుక వంటివి కావాలి. కానీ అవేమీ లేకుండానే..థర్మాకోల్‌తో గదులను కట్టేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. థర్మాకోల్ తో రూమ్స్ నిర్మాణం ముందుగా సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ప్రాంగణంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక తరగతి గదిని నిర్మిస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా థర్మాకోల్ తో క్లాస్‌రూంలను నిర్మించనున్నారు. సాధారణ పద్ధతిలో ఒక తరగతి గది నిర్మించాలంటే రూ. 7లక్షల వరకు ఖర్చు అవుతుంది..కానీ థర్మాకోల్ తో రూ.5 లక్షల ఖర్చుతోనే నిర్మించవచ్చు.పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు.. కేజీబీవీలు..మోడల్ స్కూల్స్ లో ప్రస్తుతం ఉన్నవాటికంటే అదనంగా 15వేల క్లాస్ రూమ్స్ ను అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 15 వేల తరగతి గదులను ఈపీఎస్ టెక్నాలజీతో నిర్మిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల మేర నిధులు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్లను ఈపీఎస్ టెక్నాలజీతో నిర్మిస్తే ప్రభుత్వం అనుకున్న ఖర్చులోనే పూర్తవుతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఈపీఎస్ విధానంలో భవనాల నిర్మాణానికి ప్రత్యేకమైన థర్మాకోల్‌ను ఉపయోగిస్తారు. ఈ నిర్మాణంలో ఇనుముకు బదులుగా స్టీల్‌ను వాడతారు. స్టీల్ తీగలను థర్మకోల్‌కు బిగిస్తారు. దానికి ఇసుక..సిమెంట్ మిశ్రమాన్ని అంటిస్తారు. గోడలతో పాటు పైకప్పును కూడా స్టీల్ తీగలు, థర్మకోల్‌తోనే ఏర్పాటు చేస్తారు. రూమ్ నిర్మాణం కేవలం 20 రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. ఇవి ఫైర్ ఫ్రూఫ్ వి కూడా. అంతేకాదు కరెంట్ షాక్ ప్రూఫ్‌గా ఉంటాయని అధికారులు తెలిపారు.
నిర్మాణ ఖర్చులు తగ్గించేందు థర్మాకోల్ ఆలోచన
ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేలకుపైగా అదనపు తరగతి గదుల అవసరం కాగా..వీటి నిర్మాణానికి భారీగా నిధులు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో ఖర్చు తగ్గించేందుకు నూతన టెక్నాలజీ కోసం ప్రయత్నించామనీ..ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువగా ఉన్నటువంటి ఈపీఎస్ టెక్నాలజీ విధానాన్ని ఎంపిక చేశామని స్కూల్ విద్యాశాఖ డైరెక్టర్ విజయ కుమార్ తెలిపారు.