అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరిపేందుకైనా సిద్ధం : సీఎం కేసీఆర్ 

ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకైనా సిద్ధమని.. ఏ సమస్యపై చర్చించేందుకైనా రెడీగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

  • Publish Date - January 20, 2019 / 10:19 AM IST

ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకైనా సిద్ధమని.. ఏ సమస్యపై చర్చించేందుకైనా రెడీగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ : సీఎల్ పీ లీడర్ గా ఎన్నికైన భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యులు గందరగోళం చేయడం, పేపర్లు చించివేయడం మంచి పద్ధతి కాదని, సభా సాంప్రదాయం కాదన్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకైనా సిద్ధమని.. ఏ సమస్యపై చర్చించేందుకైనా రెడీగా ఉన్నామని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో వివక్ష పాటించలేదన్నారు. నిర్మాణ సహకారం, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.

కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేయబోమని స్పష్టం చేశారు. దానికే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు బంధు విషయాన్ని కౌలు రైతులు, రైతులు చేల్చుకోవాలన్నారు. రైతులకు మేలు జరగాలని రైతు బంధు పథకం ఇస్తున్నామని చెప్పారు. వందకు వంత శాతం ఇది రైతు ప్రభుత్వం స్పష్టం చేశారు. రైతు పక్షపాతికగా ఉంటామని తెలిపారు. రైతు బీమా, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 

24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని, రెప్పపాటు కూడా పోనియ్యమని తెలిపారు. లిఫ్టు ఇరిగేషన్లకు ఎన్ని కోట్ల ఖర్చు అయినా భరిస్తామని తెలిపారు. తెలంగాణను విద్యుత్ రంగంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ప్రస్తుతం 17 వేల మెగావాట్ల కెపాసిటీ ఉందన్నారు. 28 వేల మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ సాధిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. రైతులకు, పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. గవర్నర్ మంచి ప్రసంగం చేశారని కొనియాడారు. ములుగు, నారాయణపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే కొన్ని మండలాలను కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.