ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని

  • Publish Date - October 24, 2019 / 12:12 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే సమాధానం అన్నారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ పూర్తిగా మునిగిపోయిందన్న కేసీఆర్.. ఒడ్డున పడాలంటే చాలా కష్టపడాలన్నారు.

అదే సమయంలో కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కార్మికులు తెలివైనోళ్లు అయితే దరఖాస్తులు పెట్టుకుని తిరిగి డ్యూటీలో చేరాలన్నారు. దరఖాస్తు తీసుకుని డ్యూటీకి వెళ్తే ఎవరూ వెళ్లగొట్టరని చెప్పారు. స్వచ్చందంగా వెళ్లిపోయారు కనుక.. వాళ్లే స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరాలన్నారు. 

యూనియన్లు పక్కన పెట్టి కార్మికులు పని చేసి ఉంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని.. రెండేళ్లలో రూ.లక్ష బోనస్ తీసుకునే పరిస్థితి ఉంటుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు అని చెప్పిన సీఎం.. యూనియన్ నాయకులే వారిని చెడగొట్టారని ఆరోపించారు. యూనియన్ నేతల ఉచ్చు నుంచి బయటపడితేనే కార్మికులు బాగుపడతారని హితవు పలికారు.

ఆర్టీసీ యూనియన్లపై సీఎం ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అన్నారు. సమ్మె నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ల పేరుతో ఆర్టీసీకి ఉరి బిగిస్తున్నారని చెప్పారు. ఆదాయం వచ్చే సమయంలో సమ్మె చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ సమ్మె చేయడు అన్నారు. కనీసం జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె చేస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ మునగక తప్పదని, ఎవరూ కాపాడలేరని సీఎం తేల్చి చెప్పారు. ఇక ముగిసేది సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది అని సీఎం సంచలన కామెంట్స్ చేశారు.