తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన తెలంగాణ వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి పువ్వాడ అజయ్ ను ఆదేశించారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బోటులో ఉన్న వారిలో 12 మంది హైదరాబాద్ వాసులు, 17 మంది వరంగల్ రూరల్ వాసులు ఉన్నట్లు సమాచారం.
వరంగల్ రూరల్ జిల్లా కడిపికొండ మహరాజు కాలనీకి చెందిన 17మంది చిట్టి పాటలో భాగంగా పాపికొండలు టూర్ కి వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ బోటుకు పర్యాటక అనుమతి లేదని అధికారులు నిర్ధారించారు. NDRF బృందాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం పాపికొండలకు వశిష్ట బోటు బయలుదేరింది. ఉదయం 10.30గంటలకు పోచమ్మ గండి నుంచి బయలుదేరిన ఈ బోటులో సిబ్బందితో కలిపి మొత్తం 71 మంది ఉన్నారు. కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం.
Also Read : బోటు ప్రమాదం : విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు