తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన డిశ్చార్జి అయ్యారు.
యశోదా ఆస్పత్రిలోని ప్రత్యేక వైద్యుల బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందించింది. అన్ని రకాల వైద్య పరీక్షలను సీఎం కేసీఆర్‌కు నిర్వహించారు. సుమారు 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి కూడా ఆస్పత్రికి వచ్చారు. సుమారు గంటపాటు ఆయనకు పలు రకాల టెస్టులు నిర్వహించినట్టు తెలిసింది. యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో ముఖ్యమంత్రికి చికిత్స చేసిన్నట్టు సమాచారం.
ఈనెల 13వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలుసుకున్నారు. ఆ భేటీ తర్వాత సంక్రాంతి పండుగ కోసం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లిపోయారు. అయితే, అక్కడ రెండు రోజుల నుంచి జ్వరంగా ఉండడంతో ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ వచ్చారు. అయితే, రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరగడంతో పాటు, హైబీపీ కూడా వచ్చినట్టు తెలిసింది. దీంతో కుటుంసభ్యులు వెంటనే ముఖ్యమంత్రిని యశోద ఆస్పత్రికి తరలించారు.
కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి వచ్చారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మరికొందరు టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఆస్పత్రి వద్దకు వచ్చారు.