హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ప్రజలు తెలివిగా ఓట్లు వేశారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్ లాంటిదన్నారు. మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా.. వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని ఆరోపించిన కేసీఆర్.. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కేసీఆర్ ను తిడితే ఓట్లు పడతాయనుకుంటే భ్రమే అన్నారు. హుజూర్ నగర్ లో తన సభ జరక్కపోయినా అద్భుతమైన మెజార్టీ ఇవ్వడం హ్యాపీగా ఉందన్నారు.
ఈ ఫలితం తర్వాత అయినా ప్రతిపక్షాలు తీరు మార్చుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెప్పడం ఆపాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని రికార్డ్ మెజార్టీతో గెలిపించిన హుజూర్ నగర్ ఓటర్లకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్ నగర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 26న హుజూర్ నగర్ లో సభ నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. స్వయంగా వచ్చి థ్యాంక్స్ చెబుతానన్నారు.
బీజేపీ నేతల మాటలకు.. వాళ్లకు వచ్చిన ఓట్లకు ఏమైనా సంబంధం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. అదే సమయంలో విజయంపై గర్వపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఫస్ట్ టైమ్ జెండా పాతింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డ్ మెజార్టీతో గెలుపు నమోదు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు ఆనందోత్సాహల్లో మునిగిపోయాయి.
43వేల 233 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం చూపారు. ఇప్పటివరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెజార్టీ 29వేల 194. ఆ రికార్డ్ ఇప్పుడు చెరిగిపోయింది. 15వ రౌండ్ లోనే పాత రికార్డ్ ను సైదిరెడ్డి అధిగమించారు. 2లక్షల 754 ఓట్లలో 50శాతానికిపైగా ఓట్లు సాధించి రికార్డ్ నెలకొల్పారు సైదిరెడ్డి. ఈ గెలుపుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డ్ ను సైదిరెడ్డి బ్రేక్ చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది.