తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే వారిపై పీడీ యాక్ట్ పెడతామని, జైలుకి పంపుతామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. షాపు లైసెన్స్ లు రద్దు చేసి, షాపులను సీజ్ చేస్తామన్నారు. లాక్ డౌన్ విధించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రజలు సహకరించకపోతే కఠిన చర్యలకు వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు బంద్ చేయాలని సీఎం ఆదేశించారు. సాయంత్రం 6 తర్వాత ఏ షాపు తెరిచినా సీజ్ చేస్తామన్నారు.
తెలంగాణలో రా.7 నుంచి ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ:
కరోనా వైరస్ చాలా పెద్ద సమస్యన్న సీఎం కేసీఆర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. నిన్నటివరకు పోలీసులు సున్నితంగా చెప్పారన్న సీఎం, ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. అమెరికా లాంటి దేశమే ఆర్మీని దించిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అంతటా రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి పెట్టారు. మంగళవారం(మార్చి 24,2020) ప్రగతిభవన్ లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా 4 గంటల పాటు ఈ అత్యవసర సమావేశం జరిగింది. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ:
రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ప్రజలు చెప్పిన మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ తప్పదని సీఎం హెచ్చరించారు. అది కూడా వినకపోతే షూట్ ఎట్ సైట్, ఆర్మీని రంగంలోకి దింపడం తప్పదన్నారు. సమాజానికి ఇబ్బంది కలిగేలా చేస్తే అన్ని లైసెన్స్ లు రద్దు చేస్తామన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా చెబుతున్నామన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్ల పాస్ పోర్టులు సీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మాట వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆదేశాలు:
”కొన్ని దేశాల్లో ప్రజలు, పోలీసుల మాట వినకపోవడతో ప్రభుత్వాలు ఆర్మీని రంగంలోకి దించాయి. మన దగ్గర కూడా ప్రజలు పోలీసుల మాట వినకపోతే, సహకరించకపోతే ఆటోమేటిక్ గా 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి కూడా కంట్రోల్ కాకపోతే ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి, దుస్థితి మనకు అవసరమా? మనకు మనమే నియంత్రణ పాటిస్తే సరిపోతుంది కదా. ఒక వ్యక్తితో పది మందికి, వంద మందికి, వెయ్యి మందికి కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. మొత్తం సమాజానికే దెబ్బ. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఆపదు. దయచేసి అలాంటి పరిస్థితిని తెలంగాణలో తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్, కర్ఫ్యూ, ఆర్మీని దించే పరిస్థితిని, దుస్థితిని తెచ్చుకోవద్దు. ప్రజలు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని అప్పీల్ చేస్తున్నా. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా చెబుతున్నాం” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా బాధితులంతా ఏప్రిల్ 7కల్లా కోలుకుంటారు:
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పట్ల అజాగ్రత్త కరెక్ట్ కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా పాకని దేశం లేదన్నారు. ఇది ప్రత్యేక పరిస్థితి అన్న సీఎం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో షూట్ ఎట్ సైట్ పరిస్థితి రాకుండా ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు. అందరూ పని చేస్తనే ఈ సమస్య నుంచి బయటపడగలం అన్నారు. అధికారులు రోడ్లపైకి వచ్చి నియంత్రిస్తుంటే, ప్రజాప్రతినిధులు ఏమైపోయారని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో 36మందికి కరోనా సోకిందన్న సీఎం కేసీఆర్ ఎవరికీ సీరియస్ గా లేదని, వారంతా కోలుకుంటున్నారని చెప్పారు. వారందరూ ఏప్రిల్ 7కల్లా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సీఎం చెప్పారు.