టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి బురిడీ కొట్టిన కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈ మధ్య తెలివి బాగా ఎక్కువైపోతున్నట్టుంది. ఏ అంశం మీద ఫోకస్‌ పెట్టాలో తెలియక.. ఏదో ఒకటి పట్టుకొని రచ్చ చేసి.. ఆ తర్వాత డిఫెన్స్‌లో పడిపోతున్నారు. విభజన చట్టంలో సెక్షన్-8 అని ఒకటి ఉంటుంది. ఇది పొరుగు రాష్ట్ర ప్రజలు.. స్థానికులతో ఇబ్బందులు ఎదుర్కొంటే వారి హక్కులు, ఆస్తులు కాపాడి వారికి రక్షణ కల్పించేందుకు గవర్నర్ చేతిలో ఉన్న కీలకమైన ఆయుధం.

నాటి రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండడం… అందులోనూ రెండు రాష్ట్రాలను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించడంతో ఈ సెక్షన్‌ను విభజన యాక్ట్‌లో పొందుపర్చారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లు ఉన్నారు. ఏ రాష్ట్ర పాలన ఆ రాష్ట్రంలోనే కొనసాగుతోంది. ఏపీకి సొంత రాజధాని ఏర్పాటైంది. ఇక్కడ ఉంటున్న ఆంధ్ర ప్రజలు గడచిన ఆరేళ్ళుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ,

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సెక్షన్-8ని ప్రస్తావించడం రాజకీయంగా ఒక్కసారి హీట్ పుట్టినట్టయ్యింది. సెక్షన్‌-8 అమలు చేయాలని కాంగ్రెస్‌ నేతలు కొత్తగా డిమాండ్‌ చేశారు. దీనిపై అధికార టీఆర్ఎస్‌ పార్టీ కౌంటర్‌ ఇచ్చింది. స్వరాష్ట్రం వచ్చినా సరే పరాయి పాలన కింద ఉండాలన్నదే వారి ఆకాంక్ష అని టీఆర్ఎస్‌ నేతలు ఎదురు దాడికి దిగారు. సచివాలయ కూల్చివేత నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ డిమాండ్‌ను తీసుకొచ్చింది.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శాంతి ర్యాలీతో పాటు జలదీక్షలు, కరోనా నివారణలో ప్రభుత్వ వైఫల్యంపై ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు తమ నాయకుల పట్ల ప్రవర్తించిన తీరుపై పలు మార్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. సెక్షన్-8ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. స్వయంగా హైదరాబాద్ పోలిస్ కమిషనర్ పేరును కూడా ప్రస్తవించింది. కాంగ్రెస్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఫిర్యాదు చేసినా లైట్‌ తీసుకున్న టీఆర్ఎస్‌ నేతలు.. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు.

రాజకీయాలు ఇప్పుడు సెక్షన్‌-8 చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరికి వారు ప్రశాంతంగా ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఇప్పుడు ఈ సెక్షన్ చర్చనీయాంశం అయ్యింది. కాకపోతే దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీయే ఇరకాటం పడిందంటున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సెక్షన్‌ను ప్రస్తావించి సెంటిమెంట్‌ను రెచ్చగోట్టే ప్రయత్నం చేసిందని అనుకుంటున్నారు. కానీ, ఇది టీఆర్ఎస్‌కే కలసి వస్తుందని కాంగ్రెస్‌ నేతలు ఆలస్యంగా గ్రహించారట. తామేమీ సచివాలయం కూల్చొద్దని అనడం లేదని, కొంతకాలం వాయిదా వేయాలని మాత్రమే అంటున్నామంటూ మేటర్‌ను ట్విస్ట్‌ చేశారు కాంగ్రెస్‌ నేతలు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది ఒక గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు మాత్రమే. త్వరలోనే రాబోయే ఎన్నికలకు మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ బేస్‌గా తమ కార్యకలపాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు అభివృద్ధి, డబుల్ బెడ్ రూం వంటి అంశాల చూట్టు తిరిగిన చర్చ… కాంగ్రెస్ పేర్కొన్న సెక్షన్-8తో రూట్‌ మారింది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టేందుకే కాంగ్రెస్ ఈ డిమాండ్ చేస్తోందని టీఆర్ఎస్ కౌంటర్‌ ఇస్తోంది. దీంతో హస్తం పార్టీకి నష్ట్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలనుకున్న ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీయే ఇరుకులో పడుతోందని జనాలతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు.