దేశవ్యాప్తుంగా సీఏఏపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఎన్ ఆర్ సీ, సీఏఏపై దేశం అట్టుడుకుతోంది. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. సీఏఏపై హైదరాబాద్ లోనూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నగరంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెప్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఏఏ.. భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనిపై ప్రజాస్వామ్య పద్ధతిలో జామియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీల్లో జరుగుతున్న నిరసనలపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతో అణిచివేస్తున్నాయని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో పోలీసులు ప్రవేశించి విద్యార్థులను హింసించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. డిసెంబర్ 28 వ తేదీ గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం ఉరేగింపు, కాంగ్రెస్ ఫ్లాగ్ మార్చ్ చేపడతామని పోలీసులను అనుమతి కోరామని తెలిపారు. వారం రోజులపాటు అన్ని మున్సిపాలిటీల్లో సీఏఏ, ఎన్ ఆర్ సీకి వ్యతిరకంగా నిరసన కార్యక్రమాలు, కాంగ్రెస్ ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అనంతరం మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అందరికీ సమానత్వం ఉందన్నారు. అన్ని మతాలు, జాతులకు సమానత్వం ఉందని తెలిపారు. పరుషులతో సమానంగా మహిళలకు సమానత్వం ఉండాలన్నారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోరుకుంటున్నామని వెల్లడించారు.