తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు పార్టీ ఎజెండా పెట్టుకుని రేవంత్ ఆందోళన చేయడమేంటని వీహెచ్ ప్రశ్నించారు. గోపనపల్లి భూముల వ్యవహారాన్ని ఎదుర్కోలేకే తెరపైకి ట్రిపుల్ వన్(111) జీవో అంశాన్ని రేవంత్ తెచ్చారని వీహెచ్ మండిపడ్డారు.
ట్రిపుల్ వన్(111) జీవో పరిధిలో కేటీఆర్‌ది మాత్రమే కాదని, తమ వాళ్లవి చాలా నిర్మాణాలు ఉన్నాయని వీహెచ్ చెప్పారు. సొంత ఎజెండా పెట్టుకుంటే కాంగ్రెస్ లో నడవదని రేవంత్ కు తేల్చి చెప్పారాయన. ఏ అంశం అయినా పార్టీలో చర్చించి పోరాటం చేస్తే మద్దతు ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారమంతా అక్కడ ఇళ్లు కట్టుకున్న వాళ్లను బెదిరించడానికే అని వీహెచ్ ఆరోపించారు.
కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్ రెడ్డి పోరాటం ఆయన వ్యక్తిగతమని దానికి పార్టీకి సంబంధం లేదని వీహెచ్ అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత విషయాలు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన మీద ఆరోపణలు వస్తే.. వేరే వాళ్లపై ఆరోపణలు చేస్తున్నాడని, ముందు తనమీద వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదని వీహెచ్ అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి వ్యవహారంపై పార్టీలో చర్చ జరగాలి. 111 జీవో పరిధిలో కాంగ్రెస్ వాళ్లకే ఎక్కువ ఫామ్ హౌస్‌లున్నాయి. ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తే ఎలా?’’ అని వీహెచ్ మండిపడ్డారు.