హైదరాబాద్: హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు
హైదరాబాద్: హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. లేనిపక్షంలో కోర్టు తనపని తాను చేసుకుపోతుందని వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఇచ్చిన నోటీసులను స్పీకర్ విస్మరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో స్పీకర్‌ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది.
బహిష్కరణకు గురైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్) సభ్యత్వ పునరుద్ధరణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కార వ్యాజ్యం ఊహించని మలుపు తిరిగింది. కోర్టు నోటీసులను తిరస్కరించిన అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారిని సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. కోర్టు నోటీసులు తీసుకున్న డీజీపీ, నల్లగొండ, జోగుళాంబ గద్వాల జిల్లాల ఎస్పీలు స్పందించకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రత్యేకంగా మరోసారి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తదుపరి విచారణకు వారు హాజరవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార కేసులో తాము ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదో మార్చి 8న చెప్పాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.
స్పీకర్ మధుసూదనాచారి గత ఉత్తర్వులను అమలు చేయకపోగా కోర్టు నోటీసులను తిరస్కరించడం ద్వారా ధిక్కరణకు పాల్పడ్డారన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి చెప్పారు. మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు భద్రత కల్పించకపోవటానికి సంబంధించి డీజీపీ, నల్గొండ, జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం మధుసూదనాచారితో పాటు డీజీపీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేస్తున్నామని, తదుపరి విచారణకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. మణిపూర్ స్పీకర్ అరెస్టు, కోర్టుకు హాజరుకు సంబంధించిన మనిలాల్ సింగ్ వర్సెస్ డాక్టర్ హెచ్.బోరోబాబూసింగ్ కేసు, సీకే దెఫ్తారి వర్సెస్ ఒపీ గుప్త కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ రాష్ట్ర బలగాలు సహకరించకపోతే ఏం చేయాలో తమకు తెలుసని, కేంద్ర బలగాల సాయంతో అప్పటి స్పీకర్‌ను అరెస్ట్ చేయించడానికీ వెనుకాడబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను హైకోర్టు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. అనంతరం రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాక వారిద్దరూ విడుదలయ్యారు. కోర్టును అవమానించేలా వ్యవహరించారంటూ అదనపు ఏజీ రాంచందర్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్‌పై సీరియస్ అయ్యారు.