బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 చిన్న కోడలు సోఫీ హెలెన్ రైస్ జోన్స్ సోమవారం( ఏప్రిల్ 29, 2019) హైదరాబాద్ కి రానున్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఇన్ బర్న్, అవుట్ బర్న్ యూనిట్ లతోపాటు ఇంక్యుబేటర్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోనున్నారు. నియోనాటాలజీ విభాగాన్ని పరిశీలిస్తారు. నెలలు నిండకుండా జన్మించి, కంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిడండ్రులతో ఆమె మాట్లాడనున్నారు. గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల కంటి శుక్లాలకు సంబంధించిన ఆర్‌ఓపీ (రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ) సేవలను సోఫీ పరిశీలించనున్నారు. వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకోనున్నారు.
క్వీన్ ఎలిజబెత్ 2 చిన్న కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ భార్యే సోఫీ. ”క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్” పేరుతో సోఫీ ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో పలు ఆరోగ్య సమస్యల నివారణకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థతో కలిసి క్వీన్ ఫౌండేషన్ పని చేస్తున్నారు. ప్రీ మెచ్యూర్డ్ బేబీల కంటి సమస్యలపై ‘రెటినల్ అబ్జర్వేటరీ ఇన్ప్రీ మెచ్యూర్డ్’ పేరుతో దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు క్వీన్ ఎలిజబెత్ ఫౌండేషన్ ద్వారా నిధులు అందిస్తున్నారు. గాంధీలో కూడా ఈ సంస్థల సేవలు అందుతున్నాయి. ఇక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు సోఫీ వస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్లతో సోఫీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో 2015 నుంచి 4వేల మంది చిన్నారులకు వైద్యాన్ని అందించారు. మన దేశంలో 4 రాష్ట్రాల్లో ట్రస్ట్ సేవలను అందిస్తుండగా.. తెలంగాణలో గాంధీ, నిలోఫర్‌లతోపాటు నల్గొండ, సంగారెడ్డి కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ట్రస్ట్‌కు వైస్ ప్యాట్రన్ అయిన సోఫీ హెలెన్.. గాంధీ, నిలోఫర్‌లతోపాటు ఎల్వీప్రసాద్ ఆసుపత్రిని కూడా సందర్శించనున్నారని అధికారులు తెలిపారు.