హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో క్రేన్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో దుకాణాలు మూసి ఉన్నాయి. దీంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేదంటే ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ ఘటనలో 5 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. టర్న్ తీసుకుంటున్న సమయంలో వాహనం అదుపు తప్పింది. డ్రైవర్.. క్రేన్ వాహనాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయాడు. దీంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలు, దుకాణాలపై దూసుకెళ్లింది. డివైడర్ ను ఎక్కేసింది.
క్రేన్ మీదకు దూసుకురావడంతో అక్కడే ఉన్న చిరువ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు మరో భారీ క్రేన్ వాహనం తీసుకొచ్చి.. డివైడర్ పైకి ఎక్కిన క్రేన్ ను రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తరలించారు. వాహనాలు డ్యామేజ్ కావడంతో తాము నష్టపోయామని, తమకు పరిహారం ఇవ్వాలని వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారు.