ఏపీకి తెలంగాణ పోలీసులు : అశోక్ కోసం వేట

ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా

  • Publish Date - March 5, 2019 / 07:54 AM IST

ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా

ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా  గాలిస్తున్నాయి. అశోక్ ఏపీలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కి సైబరాబాద్ పోలీసులు లేఖ రాయనున్నారు. 160 సీఆర్పీసీకి కింద అశోక్‌కి నోటీసులు ఇచ్చారు. ఐటీ గ్రిడ్ కంపెనీ హార్డ్ డిస్క్‌లో ఏపీలోని అన్ని జిల్లాల ఆధార్ డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ డేటా ఐటీ గ్రిడ్ కంపెనీకి ఎలా చేరింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌ రెడ్డిని బెదిరించిన ఏపీ పోలీసులపైనా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఏపీ ఓటర్లు, లబ్దిదారుల డేటాను ప్రైవేట్ సంస్థ ఐటీ గ్రిడ్స్‌కి అప్పగించడం, అక్కడి నుంచి ఆ డేటా పక్కదారి పట్టిందన్న కేసులో సంచలనంగా మారింది. ఫిబ్రవరి 21న అశోక్‌ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 27న ఐటీ గ్రిడ్స్ సంస్థలో కొంత డేటాను ప్రత్యేక హార్డ్ డిస్కుల్లోకి డౌన్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి అశోక్‌ను మరోసారి ప్రశ్నించాలనుకుంటున్నారు పోలీసులు. డౌన్ లోడ్ చేసిన డేటాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అశోక్‌ను రెండు రోజుల్లో స్వచ్ఛందంగా తమ ఎదుట లొంగిపోవాలని కోరారు. లేకపోతే హైకోర్టు ఉత్తర్వులతో ఏపీకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈ కేసు రాజకీయ దుమారం రేపుతోంది. తమ పార్టీకి చెందిన ప్రజల ఓట్లను తొలగించే కుట్రతోనే ఈ డేటా చౌర్యం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో… తమ పార్టీ మద్దతుదారుల డేటాను వైసీపీకి అందించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన మంత్రికీ, అధికారులకూ నోటీసులు ఇస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తద్వారా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌కు నోటీసులు పంపిస్తారని అర్థమవుతోంది. అసలు ఏపీ ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత డేటాను… హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థకు ఎలా ఇచ్చారు? అక్కడి నుంచి ఆ డేటాను… టీడీపీ అనధికారికంగా సేవా మిత్ర యాప్ కోసం ఎలా ఉపయోగించుకుంటోంది అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.

ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ దొరికితే ఈ కేసులో కీలక విషయాలు బయటపడతాని పోలీసులు భావిస్తున్నారు. హార్డ్ డిస్కుల్లోని సమాచారం, అమెజాన్ సర్వల్లో స్టోర్ అయిన సేవా మిత్ర యాప్ సమాచారం సేకరించి… దాని ద్వారా ఏపీలో ఓట్ల తొలగింపు జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించనున్నారు. డేటా ఆధారంగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తేలితే… ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తోపాటూ… ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.