కేంద్రంపై కేటీఆర్ అసంతృప్తి : డిఫెన్స్ ప్రాజెక్టుల్ని ఉత్తరాదికే తరలిస్తున్నారు

  • Publish Date - December 4, 2019 / 07:27 AM IST

డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనీ..కానీ మనం దిగుమతి చేసుకోవటం నుంచి  ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్‌ కాంక్లేవ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ క్వాలిటీ స్టాండర్డ్స్‌ ఇన్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఢిపెన్స్‌పై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. డిఫెన్స్‌కు అనుకూలంగా తెలంగాణ ఉందనీ..కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఉత్తరాది రాష్ర్టాలకు వాటిని తరలిస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసి డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు. 

డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధి చెందుతోందనీ.. బాలానగర్‌, కుషాయిగూడలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ స్పేర్ పార్ట్స్ తయారీ కంపెనీలున్నాయి. హైదరాబాద్‌ – బెంగళూరు హైవే మార్గంలో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడం. నాగ్ పూర్, గుజరాత్, చెన్నైలను మాత్రమే కేంద్రం పట్టించుకుంటోంది. హైదరాబాద్ కు రావాల్సిన డిఫెన్స్ ప్రాజెక్టులను కేంద్రం రానివ్వటంలేదనీ..వాటిని నాగ్ పూర్ కు తరలిస్తున్నారనీ రాజకీయ అవసరాల కోసమే కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.