డిఫరెంట్ వెదర్ : ఏపీలో చిరుజల్లులు – తెలంగాణలో మండే ఎండలు

  • Publish Date - March 28, 2019 / 04:51 AM IST

మార్చి నెలలో వేసవి తాపం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతుంటే.. ఏపీ కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

రానున్న రెండు, మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే, మూడు డిగ్రీల వరకూ అధికం నమోదు అవుతాయి. మరోపక్క దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కోస్తా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

మార్చి 27వ తేదీ బుధవారం (మార్చి 27)న కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిరిసిల్లా జిల్లా గంభీరావు పేట, నిజామాబాద్ జిల్లా బెల్లల్‌లో 40.9 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్, మెదక్ జిల్లా అల్లాదుర్గ్, హవేలి ఘన్ పూర్‌లో 40.8 డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదైంది. మార్చి 28, 29 తేదీల్లో ఇదే స్థాయి ఎండలు ఉంటాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్.  ధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.