ఆర్టీసీ చర్చలు విఫలం : సమ్మె యథాతథం

  • Publish Date - October 26, 2019 / 11:35 AM IST

టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. రెండు వర్గాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించాలని జేఏసీ కోరగా.. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ అన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ నేతలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్బంధ చర్చలు జరిపిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కోర్టు తీర్పును కూడా వక్రీకరించారని వాపోయారు. చర్చలు జరుగకుండానే సమ్మె విరమించాలని తమపై ఒత్తిడి చేశారని చెప్పారు. చర్చలకు 8 మందిని అనుమతి ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. మా సెల్ ఫోన్లు లాక్కొని లోనికి పంపారని తెలిపారు. తమను ఎక్కడా మాట్లాడనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

26 డిమాండ్లపై చర్చించాలని కోరామని.. అన్ని డిమాండ్లపై చర్చించాల్సిందేనని చెప్పామని తెలిపారు. అధికారులు అందుకు అంగీకరించలేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సరైన పద్ధతిలో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోసారి మళ్లీ చర్చలకు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎప్పుడు పిలిచినా తాము చర్చలకు వస్తామని చెప్పారు. అన్ని అంశాలపై చర్చలు జరపాలని.. సాధ్యాసాధ్యాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.  

శనివారం (అక్టోబర్ 26, 2019) ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరావు, వీఎస్ రావు చర్చలకు హాజరయ్యారు. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల కోసం 16 మంది జేఏసీ నేతలు రాగా ఆర్టీసీ ఎండీ నలుగురు నేతలను మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. మిగతా వారికి అనుమతి లేదంటూ పోలీసులు గేటు దగ్గరే ఆపేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన 22 రోజుల తర్వాత ఇరువర్గాల చర్చలు విఫలం అయ్యాయి. 

ఆర్టీసీ సమస్యలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ స్టడీ చేసి నివేదికను సంస్థ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మకు అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఉదయం సమర్పించింది. దీనిని రవాణ శాఖ మంత్రికి అందచేశారు. ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు మంత్రి నివేదిక అందించారు. సీఎం కీసీఆర్ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఇరువురి మధ్య జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.