దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ఆరిఫ్ అస్వస్థతకు గురయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఆరిఫ్ జ్వరంతో బాధపడుతున్నాడని సమాచారం.
చర్లపల్లి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంపత్ మంగళవారం(డిసెంబర్ 3,2019) నిందితుల గదులను పరిశీలించి వారితో మాట్లాడారట. ఆ సమయంలో జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని, తాము ఇబ్బంది పడుతున్నామని నిందితులు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆరిఫ్ అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించిన సూపరింటెండెంట్.. డాక్టర్‌తో పరీక్ష చేయించారు. ఆరిఫ్ జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పిన డాక్టర్ మందులు ఇచ్చారట. ఇక మరో నిందితుడు చెన్నకేశవులు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతడికీ వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి.
జైల్లో ప్రత్యేక నిఘాలో నలుగురు నిందితులను ఉంచారు. గదులు దాటి బయటకు రాకుండా నిత్యం సిబ్బంది పహారా కాస్తున్నారు. వారికి టిఫిన్, భోజనం తలుపు కింద నుంచే అందిస్తున్నారు. లోపలే బాత్ రూమ్ కూడా ఉంది. కాగా, దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైల్లో తిండి పెట్టి పోషించడం కరెక్ట్ కాదంటున్నారు. రేపిస్టులను వెంటనే శిక్షిస్తే కానీ పరిస్థితుల్లో మార్పు రాదని మహిళా సంఘాలు అంటున్నాయి. ఆడపిల్లపై చేయి వేయాలన్నా భయపడేలా శిక్షలు ఉండాలని జనం కోరుతున్నారు.