విద్యుత్‌ ఉద్యోగుల విభజన….కమిషన్ నిర్ణయంపై అసంతృప్తి

విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది.

  • Publish Date - December 28, 2019 / 02:23 AM IST

విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది.

విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది. అయితే కమిషన్‌ నిర్ణయంపై రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే కమిషన్‌ నిర్ణయాన్ని పాటించక తప్పదంటున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఎడ తెగని పంచాయతీ కొనసాగుతోంది. అన్ని స్థాయిల ఉద్యోగుల విభజన పూర్తయినా.. 1157 మంది విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పేచీ ఏర్పడింది.

విభజన తర్వాత తెలంగాణలో ఏపీ ఉద్యోగులు అధికంగా ఉన్నారని ఏపీ స్థానికత ఉన్న 1157 మందిని ఏకపక్షంగా రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఏపీ స్థానికత ఉద్యోగులు అనేక ఆందోళనలకు దిగారు. ఈ వివాదంపై హైకోర్టును ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మధ్యేమార్గంగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి విభజన పూర్తి చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి రెండు రాష్ట్రాల ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చారు. అనేక దఫాలుగా రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించి తుది నిర్ణయం ప్రకటించారు. 1157 మందిలో 613 మందిని ఏపీకి.. 505 మందిని తెలంగాణకు కేటాయించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఆప్షన్లు ఇచ్చిన కారణంగా మరో 242 మందిని కూడా తెలంగాణకు.. ఆప్షన్లు ఇవ్వకపోయినా 42 మందిని ఏపీ కేటాయించారు. అయితే ధర్మాధికారి కమిషన్ నిర్ణయంపై రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు అంటే మాకు ఎక్కువ మందిని కేటాయించారని అభిప్రాయపడుతున్నారు. 

ఏదేమైనా ధర్మాధికారి కమిషన్ నిర్ణయం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా ఇంకా దీనిపై పోరాడే ఉద్దేశంలో లేవని తెలుస్తోంది. ఉద్యోగస్తులు కూడా ఇంకా సాగదీయడం వల్ల లాభం లేదని అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. దీంతో విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తి అయినట్లేనని భావిస్తున్నారు.