వీళ్లు మారరు : 755 మంది మందుబాబులకు జైలు

  • Publish Date - March 3, 2019 / 05:22 AM IST

హైదరాబాద్: తాగి వాహనాలు నడపొద్దురా బాబూ అంటు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా మందుబాబులు మాత్రం ఎంతమాత్రం వినటంలేదు. రోజు చెక్కింగ్ లలో పట్టుబడటం..ఫైన్ కట్టటం మళ్లీ అదేపని. కానీ నగర పోలీసులు వారిని అంతటితో వదలటం లేదు..మందుకొట్టి బండి నడిన 755 మందికి జైలు శిక్ష ఖరారు చేసి ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.

 
ఈ క్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతు..ఫిబ్రవరి నెలలో నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2972 మందిపై కేసులు నమోదు చేశామని..పట్టుబడ్డవారిపై కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేయగా 755 మందికి జైలు శిక్షలు ఖరారు చేస్తూ నాంపల్లి 3,4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు తీర్పునిచ్చాయని తెలిపారు.
ఈ శిక్షలతో పాటు 25 మంది లైసెన్స్‌లు రద్దు, 154 మంది లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తూ తీర్పులు వెలువడ్డాయని ఆయన వివరించారు. వీటికి తోడు ఇద్దరు టాప్ వాయిలేటర్స్‌కు, డేంజర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తికి మూడు రోజుల పాటు జైలు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు చెప్పాయని అదనపు సీపీ తెలిపారు.