హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. కర్నాటక కోస్తా నుంచి తెలంగాణ పక్క నుంచి విదర్భ మీదుగా మధ్యప్రదేశ్ వరకు 900 కిలోమీటర్ల మేర ఎత్తున ద్రోణి ఏర్పడిందని ఆయన వివరించారు. తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులు ఈ ద్రోణి వల్ల భూమి మీదకు వస్తున్నాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందు వల్ల చలి తీవ్రత తగ్గినట్లు పేర్కొన్నారు.
శని, ఆదివారాల్లో ఇదే వాతావరణం ఉంటుందని చెప్పారు. పగటిపూట పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరిగి 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. రాత్రిపూట ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.