హైదరాబాద్ : ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు. శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. సాహిత్యంలో ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆగకుండా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ఆయన తెలుగు సాహిత్య చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలూ రాశారు.అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ద్వానా శాస్త్రి.
తెలుగు సాహిత్యానికి తేనెలొలుకు వెలుగులద్దిన మహోన్నతుడు..ఆయన సాహిత్య సేవలు విలువ కట్టలేనివి.తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆ మహానుభావుడు ద్వానా శాస్త్రి మృతి తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు అనంటం ఎటువంటి సందేహ లేదు. ఆయన మృతికి తెలుగు సాహిత్య కారులు ఘన నివాళులర్పించారు.