ఇండోనేషియాలో చిక్కుకుపోయిన హైదరాబాద్ మహిళను అక్కడి భారత ఎంబస్సీ కాపాడింది. పెళ్లి చేసుకుని ఇండోనేషియాకు తీసుకెళ్లిన భర్త తీవ్రంగా వేధింపులకు గురి చేస్తూ స్వదేశానికి వెళ్లేందుకు నిరాకరించాడు. విషయాన్ని ఎంబస్సీ అధికారులకు తెలియజేయడంతో ఇండోనేషియా పోలీసుల సహాయంతో ఇంటికి వెళ్లి 23 సంవత్సరాల మహిళను, రెండున్నరేళ్ల కొడుకుని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
గురువారం అధికారులు బాధిత మహిళను కలిసినట్లుగా చెప్పారు. ‘సాధ్యమైనంత సాయం చేశాం. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి మంచి కండిషన్ లో ఉంది. మహిళ అభ్యర్థన మేరకే భారత్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. దురదృష్టవశాత్తు 2019 సెప్టెంబర్ 5న హీనా భారత్‌కు బయల్దేరాల్సి ఉంది.
టోలీ చౌకీలోని కర్వాన్ కాలనీకి సమీపంలో ఉంటున్న బాధితురాలి తల్లి నజ్మా బేగం కూతురి గురించి కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కు సాయం చేయాలని కోరారు. నజ్మా ఫిర్యాదు మేరకు కేరళ వాసి అయిన తన అల్లుడు పూఝికుత్ ఫజ్లుల్ రహ్మాన్ ఇండోనేషియాలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. చేతులపై వాతలు కూడా పెట్టాడని ఫొటోలను చూపిస్తూ బాధితురాలి తల్లి వాపోయింది.
మజ్లిస్ బచావో తెరీక్ నాయకుడు అమ్జెద్ ఉల్లాహ్ ఖాన్‌కు ఫిర్యాదు అందడంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి, జకార్తాలో ఉంటున్న భారత ఎంబెస్సీకి సమాచారం అందించారు. హీనాను సంప్రదించిన ఎంబస్సీ దీని నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది.