హైదరాబాద్ : పోలీసు శాఖ త్వరలో మరో టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. ‘అత్యవసర సేవల’ కోసం ఎమర్జన్సీ కాల్ బాక్స్ సేవలు తీసుకురానుంది. రోడ్డు పక్కన వీటిని అమరుస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినా, ఎవరైనా ఆపదలో ఉన్నా.. వెంటనే ఈ కాల్ బాక్స్ బటన్‌ను ప్రెస్ చేయాలి. మనం మాట్లాడి అందించిన సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్‌కి చేరుతుంది. కెమెరా ద్వారా ఫిర్యాదుదారు సైతం కనిపిస్తారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు.
ఇప్పటికే ఈ తరహా విధానం విదేశాల్లో ఉంది. లండన్, న్యూయార్క్, సిడ్నీ, బ్రిస్బేన్, ప్యారిస్ తదితర నగరాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నగరవాసులకూ చేరువకానుంది. పోలీసు శాఖతో కలిసి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అవసరమైన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఎల్‌అండ్‌టీ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్కు వద్ద ఈ బాక్స్ ఏర్పాటు చేశారు. నగరంలో రద్దీ ఉండే చోట, ముఖ్యమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఎవరైనా పోలీసులకు తక్షణం ఏదైనా సమాచారం, ఫిర్యాదు అందించాలని అనుకుంటే ఈ మెషీన్ వద్దకు వెళ్లి అక్కడున్న బటన్‌ను నొక్కాలి.
సిటీలో నిఘా, పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు ఇటువంటి వినూత్నమైన ప్రయోగాలను ఆ శాఖ చేస్తూనే ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు కమ్యూనిటీ పోలిసింగ్, నేనుసైతం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గస్తీని విస్తృతం చేసేలా ఇంటర్‌సెప్టార్ వాహనాలను తీసుకొచ్చి ముఖ్య ప్రాంతాల్లో వాటిని నిలుపుతున్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పాట్‌కి చేరుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేస్తున్న యంత్రాలతోనూ పోలీసులకు ప్రయోజనం కలగనుంది.