బెస్ట్ గా ఉండాలి : గిఫ్ట్ షాపుల్లో ప్రేమ జంటల సందడి

  • Publish Date - February 12, 2019 / 06:53 AM IST

వాలెంటైన్స్ డేకు ఆరు రోజుల ముందుగానే నగరంలోని సందడి అంతా గిఫ్ట్‌షాపుల్లో కనిపిస్తోంది. హృదయమెక్కడో లేదండి మా షాపులు చూడరండి అంటూ గిఫ్ట్‌షాపులు ముస్తాబయ్యాయి. వీటిలో కేవలం గ్రీటింగ్ కార్డులో, ఫ్లవర్ బోకేస్ మాత్రమే కాదండోయ్ వెరైటీగా మనం వాడే పెన్నులు స్టాండ్ నుంచి తాగే టీ కప్పుల వరకు అన్ని ప్రేమమయమే. హృదయాకారంలో ఉన్న పెన్నుల స్టాండ్, దానిలో అమర్చిన గులాబిరేకులు మనస్సును  ఆకట్టుకుంటున్నాయి.

ఇక ప్రేమకు నిదర్శనంగా నిలిచేది తాజ్‌మహాల్. నేటి యువ ప్రేమికులు మాత్రం ఇంతటి తాజ్‌మహాల్‌ను కట్టించలేకపోయినా దానికన్నా విశాలమైన, విలువైన  హృదయాన్ని నీకీస్తున్నాను ఇదిగో అంటూ తాజ్‌మహాల్ గిఫ్ట్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇక భాగ్యనగరం పాతబస్తీలో కొలువై ఎప్పుడూ కొత్తగా కనిపించే చార్మినార్‌ను తన ప్రేయసి కి గుర్తుగా నిర్మించాడు ఆమె ప్రియుడు. ఈనాటి  ప్రేమికులు  మేము అంతంటి వాళ్లం కాకపోయినా వాటిని కానుకల రూపంలో మదిలో నిలుపుకొంటాం అంటూ చార్మినార్ ప్రతిరూపాల వైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడూ నా ధ్యాసలోనే ఉండాలంటే ఎలాంటి గిఫ్ట్ పంపితే బాగుంటుందో అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి ఆలోచనలను అనుగుణంగా హృదయాకారంతో ఉన్న చేతిగడియారాలు, నిద్రలో చూసి నా ఒకరికొకరు తమతోనే  ఉన్నామనే భావన కలగడానికి  హృదయాకారంలో ఉన్న దిండ్లు, తనప్రేయసి ఆభరణాలు దాచడానికి  హృదయాకారంలో ఉన్న జ్యూయలరీ బాక్స్‌లు నీకు నేను నాకు నువ్వు అంటూ ఒకరికొకరూ చేసుకునే బాస నిజమే అవడానికి తగ్గట్టుగా కానుకలు, ఇలా రకరకాలవి మార్కెట్ లో కొలువు దీరాయి. కోరుకున్న వారు చెంతనుండగా ఏది చూసినా ఆనందమే వీటిల్లో  ఏది ఎంచుకోవాలో తెలియని అయోమయం యువ ప్రేమికులలో మొదలైంది. గిఫ్ట్‌ల ధరలు రూ. 50 నుంచి రూ.2000 వరకు ఉన్నాయట.