ఆగిపోతున్నాయ్ : ఫిబ్రవరి 6 నుంచి ఆంధ్ర ఆర్టీసీ సమ్మె

  • Publish Date - January 23, 2019 / 07:53 AM IST

విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2019, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబుతో పాటు ఉన్నతాధికారులతో జనవరి 22న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస.. బంద్ లో భాగంగా 52,000 మంది ఆర్టీసి సిబ్బంది డ్యూటీలకు రారనీ ఐకాస స్పష్టం చేసింది. ఆర్టీసీలో 2017, ఏప్రిల్ 1న 52 వేల మంది సిబ్బందికి వేతన సవరణ చేయాల్సి ఉండగా..దీనిపై తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒత్తిడితో 19 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇచ్చింది. 

ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందికి ఊరట కల్పించేందుకు కార్మిక సంఘాలు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. నిన్న జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు 15-20 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ అంత భారం భరించలేదని సంస్థ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల ఐకాస వచ్చే నెల 6 నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.