వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆ మృగాళ్లను చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితులను చంపేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఆ మృగాళ్లను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాళ్లు జైలు శిక్ష అనుభవించిడం సరికాదని, వారిని చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్టు చేశారు.
నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని..ఇక్కడ మతమనేది సమస్య కాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ జనారణ్యంలోనే కొందరు అతిభయంకరంగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పుదోవ పట్టించద్దని కోరారు.
మేజిస్ట్రేట్ నిందితులకు 14 జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భారీ భద్రత నడుమ ఆ నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకముందు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. నిందితులను తమకు అప్పగించాలంటూని నాదాలు చేశారు. స్టేషన్ లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, చెదరగొట్టారు.