ఇద్దరు స్నేహితుల మధ్య వాదన ప్రాణాలు తీసుకునేంత వరకూ వెళ్లింది. దానికి పెద్ద కారణాలు కూడా లేవు. కేవలం ఒరేయ్.. అని పిలిచాడని ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. వాదనపెరిగి స్నేహితుణ్ని హత్య చేసిన ఘటన కూకట్‌పల్లి స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట యాదవ బస్తీలో సుధీర్ (20) తల్లి తాడెల లక్ష్మితో నివాసముంటున్నాడు.
పెయింటింగ్ పనులు చేసి జీవినం సాగిస్తున్న సుధీర్ సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత రూ.50 తీసుకొని స్నేహితులైన గురజాల కిరణ్, నవీన్, రాంబాబులతో కలిసి బయటికి వెళ్లాడు. ఖైత్లాపూర్ సమీపంలోని గ్రౌండ్‌లో మద్యం తాగారు. అదే సమయంలో మరికొందరు స్నేహితులు కిరణ్, సాబేర్, హర్షవర్ధన్‌లు కూడా వీరితో కలిశారు.
మద్యం తాగిన మత్తులోనే కిరణ్, రాంబాబు, హర్షవర్ధన్‌లు ఇంటికి వెళ్లిపోయారు. కిరణ్, నవీన్, సాబేర్‌లు సుధీర్‌ల మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో.. సుధీర్‌ని అరటి పండ్లు అమ్మే సాబేర్ ఒరేయ్ అన్నాడు. ఒరేయ్ అంటావా అని వాదించిన సుధీర్ తోపులాటలో ఆ పక్కగా వెళ్లిపోయారు. సాబేర్ తన చేతిలో ఉన్న బీరు బాటిల్ పగులగొట్టి గొంతులో పొడిచాడు.
సుధీర్ కింద పడిపోవటంతో సాబేర్ అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. తోటి స్నేహితులు నవీన్, కిరణ్‌లు వెంటనే సుధీర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.