హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్‌కు నోటీసులంటించారు.
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అగ్ని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్న అధికారులు.. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్‌కు నోటీసులంటించారు. హైదరాబాద్ లో 1600 ఆస్పత్రులు, క్లినిక్ లు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్‌ఐ నేతలు ధర్నా చేపట్టారు.
ఎల్ బీనగర్ లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం ( అక్టోబర్ 21, 2019) అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4వ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. పలువురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 42మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆస్పత్రి ఎదుట బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని మండిపడ్డారు. షైన్ ఆస్పత్రిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. షైన్ ఆస్పత్రి యాజమాన్యం ఏడాదిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిసింది. ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించలేదని బయటపడింది.
చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్ చేశారు. షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాద ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.